హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు 'కన్జెషన్ ఛార్జ్' (రద్దీ రుసుము) అమలు చేయడం ఒక ఉత్తమ మార్గమని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, వసూలు చేసిన రుసుమును ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుదలకు వెచ్చిస్తే, నగర వాహనదారులు ఈ రుసుమును చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని వారి అధ్యయనంలో వెల్లడైంది.

బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్, కార్డిఫ్ యూనివర్సిటీ, కింగ్ ఫాహద్ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ మినరల్స్ సంయుక్తంగా భారత ప్రభుత్వ నిధులతో ఈ పరిశోధనను చేపట్టాయి. ఇందులో భాగంగా 435 మంది కారు ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించగా, ప్రయాణ సమయం ఆదా కావడమే తమకు అత్యంత ప్రధానమైన ప్రయోజనమని అత్యధికులు అభిప్రాయపడ్డారు.

పెరుగుతున్న వాహనాల సంఖ్యతో పాటు రోడ్ల వెడల్పులో వ్యత్యాసాలు, పాదచారుల సౌకర్యాల కొరత, రహదారులపై పార్కింగ్, అశాస్త్రీయ జంక్షన్ల వల్లే ట్రాఫిక్ సమస్య జటిలమవుతోందని ప్రొఫెసర్ ప్రశాంత సాహు విశ్లేషించారు. ఐటీ కారిడార్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని పరిశోధకులు సిఫార్సు చేశారు. హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ వద్ద గంటకు సగటున 10 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, వీటిలో అత్యధిక శాతం సింగిల్ ఆక్యుపెన్సీ వాహనాలేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వాహనాల సంఖ్య 2025 నాటికే 94.78 లక్షలకు చేరగా, 2026 చివరి నాటికి కోటి మార్కుకు చేరువవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో, కన్జెషన్ ఛార్జ్ ద్వారా సమకూరిన నిధులతో బస్సు సర్వీసులు, ఫుట్‌పాత్‌లు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని అధ్యయనం పేర్కొంది. అయితే, ఇది కేవలం పరిశోధనలోని సిఫార్సు మాత్రమేనని, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం కాదని పరిశోధక బృందం స్పష్టం చేసింది.