దేశంలో పెళ్లిళ్ల సందడి మళ్లీ మొదలైంది. రాబోయే 23 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 52 లక్షలకు పైగా వివాహాలు జరగనుండగా, దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు భారీ ఊపు లభించనుంది. ఈ వివాహాల సీజన్‌లో ఏకంగా రూ.7.5 లక్షల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. ఇది అనేక రంగాలకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు, కోట్లాది మందికి ఉపాధి కల్పించనుంది.

శనివారం (నవంబర్ 21) నుంచి డిసెంబర్ 15 వరకు కొనసాగే ఈ సీజన్‌పై సీఏఐటీ ఒక అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లోని 300 మంది ప్రముఖ వ్యాపారులు, 550 వర్తక సంఘాల నుంచి వివరాలు సేకరించి ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. ఈ కొన్ని రోజుల్లోనే పెళ్లిళ్ల కోసం కుటుంబాలు షాపింగ్‌లు, విందులు, ఇతర కార్యక్రమాలతో బిజీగా గడపనున్నాయి.

సీఏఐటీ అంచనా ప్రకారం.. మొత్తం రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారంలో సింహభాగం వస్తువుల కొనుగోళ్ల రూపంలోనే జరగనుంది. సుమారు రూ.4.05 లక్షల కోట్ల వ్యాపారం (54 శాతం) ఈ విభాగంలోనే ఉంటుందని పేర్కొంది. ఇందులో బంగారం, వెండి, వజ్రాభరణాల కొనుగోళ్లకు రూ.1.2 లక్షల కోట్లు, వస్త్రాలు, దుస్తుల రంగానికి రూ.90,000 కోట్లు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ వంటి వాటికి రూ.75,000 కోట్లు, బహుమతులు, ఇతర సరుకులకు రూ.37,500 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఇక సేవల రంగం ద్వారా రూ.3.5 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని అంచనా. ఇందులో కల్యాణ మండపాలు, హోటళ్లకు రూ.60,000 కోట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, డెకరేషన్‌కు రూ.37,500 కోట్లు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, బ్యూటీ సర్వీసులకు రూ.22,500 కోట్ల చొప్పున వ్యాపారం జరగనుంది. రవాణా, సంగీతం వంటి ఇతర రంగాలకూ భారీగా గిరాకీ ఉండనుంది.

ఈ పెళ్లిళ్ల సీజన్ కేవలం వ్యాపారులకే కాకుండా లక్షలాది మందికి ఉపాధిని కూడా అందించనుంది. క్యాటరింగ్, డెకరేషన్, ఫొటోగ్రఫీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి అనుబంధ రంగాల్లో సుమారు 1.25 కోట్ల మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఏఐటీ తన నివేదికలో పేర్కొంది. దీంతో కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న మార్కెట్లలో కొత్త కళ రానుంది.