భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టులోకి తీసుకోకపోవడంపై చెలరేగిన రాజకీయ వివాదంపై కాంగ్రెస్ నేత ముంతాజ్ పటేల్ స్పందించారు. సిరాజ్ మతం కారణంగానే జట్టులో చోటు దక్కలేదంటూ సొంత పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలను ఆమె బహిరంగంగా తప్పుబట్టారు. భారత జట్టు ఎంపిక కేవలం ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ప్రతిభ ఆధారంగానే జరుగుతుందని, మతంతో ఎటువంటి సంబంధం ఉండదని ఆమె స్పష్టం చేశారు.

టీమిండియాలో మతపరమైన విభజనలకు తావులేదని ముంతాజ్ పటేల్ పేర్కొన్నారు. భారత జట్టు విషయానికి వస్తే అందరికీ 'భారతీయుడు' అనేదే ఏకైక ప్రాథమిక గుర్తింపు అని ఆమె అన్నారు. టోర్నమెంట్‌కు అవసరమైన, అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను మాత్రమే సెలెక్టర్లు ఎంపిక చేస్తారని తెలిపారు. భారత క్రికెట్‌లో రాష్ట్రం, మతం, సంస్కృతి లేదా కులం ప్రాతిపదికన ఎప్పుడూ విభజన జరగలేదని, అలాంటి సంస్కృతి జట్టులో ఉండదని ఆమె వివరించారు.

ఇదే సమయంలో, దేశంలో పెరుగుతున్న విభజన రాజకీయాలపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీల నేతల పేర్లను నేరుగా ప్రస్తావించకుండానే.. కొందరు దుస్తులను బట్టి మనుషులను గుర్తించడం, అలాగే ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన "బటేంగే తో కటేంగే" వంటి నినాదాలతో సమాజంలో విభజన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆమె విమర్శించారు.

అంతకుముందు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ సిరాజ్ ఉదంతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిరాజ్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, అతని పేరు ‘సిరాజ్’ అయినందువల్లే న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. మహ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఇతర ఆటగాళ్ల పేర్లను కూడా ప్రస్తావిస్తూ.. సెలక్షన్ అనేది పనితీరు ఆధారంగానే జరగాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

మసూద్ చేసిన ఈ ఆరోపణలను క్రీడా, రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. భారత క్రికెట్ సెలక్షన్లలో మత వివక్ష ఉంటుందన్న ప్రచారాన్ని భారత మాజీ ఆల్‌రౌండర్ మదన్ లాల్, శివసేన నేత ఆనంద్ దూబే పూర్తిగా కొట్టిపారేశారు. క్రికెట్ ఎంపికల్లో ప్రతిభే ప్రామాణికమని వారు స్పష్టం చేశారు.