గత వారం రోజులుగా భారీగా పతనమవుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం నాటి ఆసియా ట్రేడింగ్‌లో స్వల్పంగా పుంజుకున్నాయి. అయితే, దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర క్రమంగా రూ. లక్ష మార్కుకు పడిపోతుందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

గత వారంలో దాదాపు 9 శాతం మేర క్షీణించిన స్పాట్ గోల్డ్, తాజా ట్రేడింగ్‌లో 1.2 శాతం లాభపడి ఔన్సుకు 3,576.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1.7 శాతం పెరిగాయి. దేశీయ మార్కెట్ విషయానికి వస్తే, ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) తాజా గణాంకాల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,638 తగ్గి రూ.1,23,893 వద్ద ముగిసింది. అలాగే కిలో వెండి ధర రూ.7,911 క్షీణించి రూ.1,52,528 వద్దకు చేరింది.

అమెరికా డాలర్ బలోపేతం కావడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు పసిడి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ.. ఒకవేళ రూపాయి విలువ గణనీయంగా పుంజుకుని, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 3,000 డాలర్ల స్థాయికి దిగివస్తే, భారత్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.1,00,000 వరకు పడిపోయే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పేర్కొన్నారు.

మరోవైపు ధరలు తగ్గడంతో భారత్, చైనా మార్కెట్లలో కొనుగోళ్లు తిరిగి పుంజుకుంటున్నాయి. మూడో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు 321 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. బులియన్ మార్కెట్ తదుపరి గమనం అమెరికా విడుదల చేయనున్న ద్రవ్యోల్బణ డేటా, ఫెడ్ విధానాలపై ఆధారపడి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.