తపాలా శాఖ (పోస్టల్ డిపార్ట్ మెంట్) ఆధ్వర్యంలో అమలవుతున్న చిన్న పొదుపు పథకాల్లో ఒకటైన కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)లో పెట్టుబడి పెట్టే వారికి ముందస్తు నగదు ఉపసంహరణపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. మెచ్యూరిటీ కంటే ముందే డబ్బులు వెనక్కి తీసుకోవాలనుకుంటే ఖాతా తెరిచిన నాటి నుంచి కనీసం 30 నెలలు (రెండున్నరేళ్లు) పూర్తి కావాల్సి ఉంటుంది.

ఇండియా పోస్ట్ కేవీపీ పథకం నిబంధనల ప్రకారం.. ఖాతా ప్రారంభించిన 30 నెలల లోపు సాధారణ పరిస్థితుల్లో నగదును వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఉండదు. అయితే, ఖాతాదారుడు మరణించినప్పుడు లేదా న్యాయస్థానం ఆదేశాలు ఉన్నటువంటి ప్రత్యేక, అత్యవసర సందర్భాలలో మాత్రమే 30 నెలల కంటే ముందే ఖాతాను క్లోజ్ చేసే వెసులుబాటు ఉంటుంది.

లాకిన్ పీరియడ్ అయిన 30 నెలల గడువు దాటిన తర్వాత నిబంధనల ప్రకారం ఖాతాను ముందే రద్దు చేసుకుంటే ఎలాంటి ప్రత్యేక పెనాల్టీ వర్తించదు. కాకపోతే పూర్తి మెచ్యూరిటీ వరకు ఉంచినప్పుడు వచ్చే రాబడి కంటే ముందుగా తీసుకున్నప్పుడు లభించే వడ్డీ మొత్తం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, అధికారిక నిబంధనల ప్రకారం రూ.1,000 పెట్టుబడి పెట్టిన సర్టిఫికెట్‌పై 30 నెలల తర్వాత ఉపసంహరించుకుంటే రూ.1,173 మాత్రమే లభిస్తుంది. అదే పూర్తి మెచ్యూరిటీ కాలం వరకు ఉంచితే మొత్తం సొమ్ము రెట్టింపు అవుతుంది.

చాలామంది కేవీపీ పథకానికి పన్ను మినహాయింపులు లభిస్తాయని భావిస్తుంటారు. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఈ పథకంలో పెట్టే పెట్టుబడులకు ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. పెట్టుబడిదారులు ఈ ముఖ్యమైన నిబంధనలు, రాబడి లెక్కలను ముందుగానే పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.