తెలంగాణలోని అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరట కల్పిస్తూ సీఐడీ విభాగం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాధితుల బాండ్ల పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియను 2026 నవంబర్ 25 నుంచి నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. డిపాజిటర్ల సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ పరిశీలన ప్రక్రియను చేపట్టనున్నారు.

బాండ్ల పరిశీలన కోసం హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ, మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిపాజిటర్లు తమకు కేటాయించిన కేంద్రాలలో మండలాల వారీగా ప్రకటించే షెడ్యూల్ ప్రకారం హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరిశీలన ప్రక్రియ అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

ఈ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరయ్యే డిపాజిటర్లు తమ వెంట ఒరిజినల్ అగ్రిగోల్డ్ బాండ్ లేదా నగదు రసీదు, వాటిపై సంతకం చేసిన కలర్ జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు, ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫొటో, మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకురావాలని సీఐడీ అధికారులు సూచించారు.

అసలు బాండ్ల సమర్పణపై సీఐడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వెరిఫికేషన్ కోసం కేవలం ఒరిజినల్ బాండ్లను సరిచూడటానికి మాత్రమే అధికారులు పరిశీలిస్తారని, వాటిని తమ వద్దే అప్పగించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. సమర్పించిన జిరాక్స్ కాపీలు, వివరాలకు సంబంధించి బాధితులకు అధికారిక రసీదు (అక్నాలెడ్జ్‌మెంట్) అందజేస్తారు. వ్యక్తిగతంగా రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల తరఫున వారి కుటుంబ సభ్యులు హాజరు కావచ్చని, అందుకు సంబంధిత అధీకృత పత్రం (ఆథరైజేషన్ లెటర్), కుటుంబ సంబంధాన్ని ధ్రువీకరించే ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఒకవేళ అసలు డిపాజిటర్ మరణించి ఉంటే.. వారి నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు సంబంధిత డెత్ సర్టిఫికెట్, వారసత్వ హక్కును ధ్రువీకరించే చట్టబద్ధమైన పత్రాలను అదనంగా సమర్పించాల్సి ఉంటుంది. బాధితులందరూ తమ పరిధిలోని కేంద్రాల్లో నిర్దేశిత సమయానికి హాజరై వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.