కెనడాలోని బ్రిటిష్ కొలంబియా పరిధిలోని సర్రే నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వాల్‌మార్ట్ స్టోర్ పార్కింగ్ లాట్‌లో జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ప్రేమ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ కాల్పులు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవస్థీకృత నేర ముఠాలు (ఆర్గనైజ్డ్ క్రైమ్) జరిపిన దాడిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు.

ఈ జంట హత్యల కేసును దర్యాప్తు చేస్తున్న 'ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్' (ఐహెచ్ఐటీ) మృతుల వివరాలను వెల్లడించింది. మరణించిన వారిని డెల్టా ప్రాంతానికి చెందిన గగన్‌ప్రీత్ రెహల్ (23), సుఖ్‌జీత్ కౌర్ (24)గా గుర్తించారు. గగన్‌ప్రీత్‌పై గతంలో తుపాకులు, ఇతర ఆయుధాల సంబంధిత నేరాల రికార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సుఖ్‌జీత్ కౌర్‌కు కెనడాలో పరిచయాలు చాలా పరిమితంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, వీరిద్దరూ ప్రేమ జంట అని సమాచారం. తన కుమారుడు కాల్పులు జరగడానికి కొద్ది నిమిషాల ముందే ఇంటి నుంచి బయటకు వెళ్లాడని గగన్‌ప్రీత్ తండ్రి వెల్లడించారు.

నవంబర్ 15 రాత్రి న్యూటన్ ప్రాంతంలోని 88 అవెన్యూ, 124 స్ట్రీట్ సమీపంలో ఉన్న వాల్‌మార్ట్ పార్కింగ్ లాట్‌లో రాత్రి 10:38 గంటల సమయంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే సర్రే పోలీసులు, పారామెడికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన గగన్‌ప్రీత్, సుఖ్‌జీత్‌లను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనా స్థలంలో బాధితుల్లో ఒకరికి చెందిన రెడ్ కలర్ ముస్టాంగ్ కారును గుర్తించారు.

ఈ కాల్పులు జరిగిన సుమారు 15 నిమిషాల వ్యవధిలోనే.. రాత్రి 10:51 గంటల సమయంలో, ప్రిన్సెస్ డ్రైవ్‌లోని 9700 బ్లాక్‌లో నాలుగు డోర్ల సెడాన్ కారు మంటల్లో కాలిపోతున్నట్లు సమాచారం అందింది. ఈ వాహనం నిందితులదే అయి ఉంటుందని భావిస్తున్న పోలీసులు, ఆ సమయంలో అందులో ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఆధారాలు సేకరిస్తున్నారు. దాడి అనంతరం ఆధారాలు దొరక్కుండా కారును తగలబెట్టడం గ్యాంగ్ నేరాలలో సాధారణంగా కనిపించే పద్ధతి అని అధికారులు భావిస్తున్నారు.

ఈ డబుల్ షూటింగ్ పక్కాగా టార్గెట్ చేసి జరిపిన దాడి అని, దీనికి వ్యవస్థీకృత నేర ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ఐహెచ్ఐటీ ప్రతినిధి సార్జెంట్ ఫ్రెడా ఫాంగ్ స్పష్టం చేశారు. అయితే హత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలు, నిర్దిష్ట గ్యాంగ్ లింకులు ఇంకా పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదని తెలిపారు. ప్రస్తుతం బాధితుల కుటుంబాలతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ విచారణ జరుపుతున్నారు. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య ఆ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరించిన వారు గానీ, పార్కింగ్ లాట్ లేదా కారు దగ్ధమైన ప్రదేశానికి సంబంధించిన డ్యాష్‌క్యామ్ ఫుటేజ్ ఉన్నవారు ఎవరైనా వెంటనే దర్యాప్తు బృందాలను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.