పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి ఆరోపించారు. దాడులకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన పులివెందులలోని అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల సమయంలోనే వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఆ అల్లర్లలో పోలీసులపై రాళ్లదాడులకు పాల్పడిన వారిపై నాన్ బెయిల్ కేసు నమోదు చేసినప్పటికీ, ఇంకా వారిని అరెస్ట్ చేయలేదని తెలిపారు. దాంతో, పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వారు మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. ఈ రోజు నామినేషన్ వేస్తున్న తమ నేతలపై, కార్యకర్తలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసి గాయపరచారని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో కొందరు కావాలనే అలజడులు సృష్టిస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వ్యక్తులపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.