తీపి తినాలన్న కోరికను తీర్చుకోవడానికి డార్క్ చాక్లెట్‌ను ఎంచుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్నవారికి అలవాటే. సాధారణంగా లభించే చాక్లెట్లతో పోలిస్తే ఇందులో కోకో శాతం ఎక్కువ. పంచదార మోతాదు తక్కువ. అయితే కేవలం డార్క్ చాక్లెట్‌ను మాత్రమే కాకుండా సరైన ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే శరీరానికి అందే పోషకాలు రెట్టింపవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజువారీ స్నాక్స్ అలవాట్లను మరింత ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి డార్క్ చాక్లెట్‌తో కలిపి తీసుకోదగిన మేలైన కాంబినేషన్లు చూద్దాం..

1. బాదం, పిస్తా గింజలతో ప్రశాంత నిద్ర
రాత్రి వేళల్లో చిన్నపాటి చిరుతిండి తినే అలవాటు ఉన్నవారికి ఈ కాంబినేషన్‌ సరైన ఎంపిక. డార్క్ చాక్లెట్, డ్రై నట్స్ (ముఖ్యంగా బాదం, పిస్తా) రెండింటిలోనూ పుష్కలంగా మెగ్నీషియం ఉంటుంది. ఇది నరాల ఒత్తిడిని తగ్గించి, కండరాలను శాంతపరుస్తుంది. దీంతో చక్కటి, గాఢమైన నిద్ర పడుతుంది.

2. బ్లూ బెర్రీలతో బ్రెయిన్ పవర్
డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్, బ్లూబెర్రీస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు కలిసి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌, అంతర్గత మంటను తగ్గించే ఔషధంగా పనిచేస్తాయి. ఈ కలయిక కేవలం రోగనిరోధక వ్యవస్థకే కాకుండా, మెదడు కణాల చురుకుదనానికి, ఏకాగ్రతను పెంచడానికి తోడ్పడుతుంది. తీపి, పులుపుల మిశ్రమ రుచితో మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే అద్భుతమైన చిరుతిండి ఇది.

3. చీజ్‌తో రక్తంలో చక్కెర సమతుల్యం
సాధారణంగా చాక్లెట్‌తో చీజ్ తినడం కాస్త వింతగా అనిపించవచ్చు. కానీ పోషకాల సమతుల్యత పరంగా ఇది బెస్ట్‌ ఆప్షన్‌. చీజ్ నుంచి అవసరమైన ప్రొటీన్లు, మంచి కొవ్వులు లభిస్తే.. డార్క్ చాక్లెట్ పీచు పదార్థాన్ని అందిస్తుంది. ఈ రెండింటి కలయిక శరీరం చక్కెరను నెమ్మదిగా గ్రహించేలా చేసి, రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అకస్మాత్తుగా పెరగకుండా కట్టడి చేస్తుంది.

4. బ్లాక్ కాఫీతో జీర్ణక్రియకు ఊతం
పాలు, చక్కెర లేని బ్లాక్ కాఫీతో డార్క్ చాక్లెట్ ముక్కను ఆస్వాదించడం కాఫీ ప్రియులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ రెండింటిలోనూ శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. పేగుల్లో మేలు చేసే బ్యాక్టీరియాను సమతుల్యం చేయడంలో, జీర్ణవ్యవస్థ సజావుగా సాగడంలో ఈ సమ్మేళనం ఎంతగానో ఉపయోగపడుతుంది.

గమనిక: ఇది సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, అలర్జీలు ఉన్నా ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి.