వైసీపీ అధినేత జగన్ ఆస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాల్మియా సిమెంట్స్ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొత్తగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ సమర్పించిన పదో చార్జ్‌షీట్ ఇది. ఇందులో జగన్‌తో పాటు దాల్మియా సిమెంట్స్ ప్రతినిధి పునీత్ దాల్మియా తదితరులను నిందితులుగా పేర్కొంది.

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనుల లీజుల కేటాయింపునకు ప్రతిఫలంగా.. జగన్‌కు చెందిన రఘురాం సిమెంట్స్ (తర్వాతి కాలంలో భారతి సిమెంట్స్)లో దాల్మియా సంస్థ రూ.95 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది. ఆ కేటాయింపుల ద్వారా జగన్ సుమారు రూ.150 కోట్ల మేర లబ్ధి పొందారని సీబీఐ ఆరోపించింది.

అనంతరం రఘురాం సిమెంట్స్ వాటాలను ఫ్రెంచ్ కంపెనీ పార్ఫిసిమ్‌కు విక్రయించగా వచ్చిన మొత్తంలో రూ.55 కోట్లు హవాలా మార్గంలో జగన్‌కు చేరాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ అంశాలపైనే ఈడీ మనీలాండరింగ్ కోణంలో లోతైన విచారణ జరిపింది. గతంలో కొన్ని సాంకేతిక కారణాలతో అభియోగపత్రాలు వెనక్కి రాగా, తాజాగా ఈడీ పూర్తి స్థాయి ఆధారాలతో న్యాయస్థానంలో చార్జ్‌షీట్ సమర్పించింది. న్యాయస్థానం దీనిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిందితులకు సమన్లు జారీ చేసే అవకాశముంది.