పిల్లలు చూయింగ్‌గమ్ నములుతుంటే పెద్దలు మందలించడం సహజం. కానీ, అదే చూయింగ్‌గమ్‌తో ప్రాణాంతక క్యాన్సర్‌కు చికిత్స అందించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చిక్కుడు జాతి గింజల (లాబ్‌లాబ్ బీన్స్) పొడితో తయారుచేసిన ఒక ప్రత్యేక చూయింగ్‌గమ్‌తో క్యాన్సర్ కారక వైరస్‌లు, బ్యాక్టీరియాలను సమర్థంగా అడ్డుకోవచ్చని తేల్చారు. ఈ ఆవిష్కరణ క్యాన్సర్ చికిత్సా రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

వైరస్‌ను బంధించే చూయింగ్‌గమ్
తల, మెడ, గొంతు వంటి పలు రకాల క్యాన్సర్లకు ప్రధాన కారణమైన 'హ్యూమన్ పాపిలోమా వైరస్' (హెచ్‌పీవీ)ను ఈ చూయింగ్‌గమ్ లక్ష్యంగా చేసుకుంటుంది. ప్రముఖ బయోకెమిస్ట్ డాక్టర్ హెన్రీ డేనియల్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధనను చేపట్టింది. వారు క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన లాలాజల నమూనాలతో ప్రయోగాలు నిర్వహించారు. చిక్కుడు గింజల పొడిలోని 'ఎఫ్‌ఎల్‌టీ3' అనే ప్రోటీన్‌తో కూడిన చూయింగ్‌గమ్‌ను ఉపయోగించగా, అది హెచ్‌పీవీ వైరస్‌కు అతుక్కుని దాన్ని నిర్వీర్యం చేసింది. ఫలితంగా, కేవలం కొంత సమయం నమిలిన తర్వాత రోగుల లాలాజలంలో వైరస్ తీవ్రత 93 శాతం మేర తగ్గినట్లు గుర్తించారు.

99 శాతం బ్యాక్టీరియా ఖతం
ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మరో రకం చూయింగ్‌గమ్‌ను కూడా పరీక్షించారు. 'ప్రొటీగ్రీన్-1' అనే పెప్టైడ్‌తో తయారుచేసిన ఈ గమ్, నోటి క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదకర బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుంది. కేవలం ఒకేసారి నమలడంతోనే ఇది 99 శాతం బ్యాక్టీరియాను అంతం చేసినట్లు వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలను ప్రముఖ సైన్స్ జర్నల్ 'బయోమెటీరియల్స్' ప్రచురించింది.

తదుపరి దశ క్లినికల్ ట్రయల్స్
చిక్కుడు గింజల నుంచి ఈ ప్రత్యేక ప్రొటీన్లను ఉత్పత్తి చేయడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, గది ఉష్ణోగ్రత వద్ద కూడా ఇవి నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాబ్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు రావడంతో, తదుపరి దశలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతితో నేరుగా మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఈ బృందం సిద్ధమవుతోంది. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకునే రోగులలో నోటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి, క్యాన్సర్ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే అడ్డుకోవడానికి ఈ చూయింగ్‌గమ్ ఒక సులభమైన, చవకైన మార్గంగా మారుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.