పండగలు, పెళ్లిళ్లు, వేడుకలు.. సందర్భం ఏదైనా తీపి పదార్థాలు కనిపిస్తే ఆగడం కష్టమే. ఒకట్రెండు రోజులు కాదు.. వరుసగా కొన్ని రోజుల పాటు స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌, ఇతర తీపి పదార్థాలు అధికంగా తీసుకుంటుంటారు. ఆ తర్వాత మళ్లీ పాత ఆహారపు అలవాట్లకు మారిపోతారు. అయితే అప్పటికీ రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా కనిపిస్తే ఆందోళన చెందాల్సిందేనా? కొన్ని రోజుల పాటు చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియపై ప్రభావం పడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే అందరిలోనూ ఈ ప్రభావం ఒకేలా ఉండదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రీడయాబెటిస్‌, మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

భోజనం తర్వాత షుగర్‌ పెరగడం సహజమే!
మనం తీసుకునే ఆహారంలోని కార్బోహైడ్రేట్లు జీర్ణమైనప్పుడు గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తాయి. దీంతో భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. శరీరంలో ఇన్సులిన్‌ తగినంతగా ఉత్పత్తి అవుతూ, కణాలు దానికి సరిగ్గా స్పందిస్తే గ్లూకోజ్‌ స్థాయులు క్రమంగా తగ్గుతాయి. ఆరోగ్యవంతుల్లో సాధారణంగా భోజనం చేసిన రెండు నుంచి మూడు గంటల్లో రక్తంలో చక్కెర స్థాయులు భోజనానికి ముందున్న స్థాయికి చేరుకుంటాయి. అయితే మధుమేహం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉన్నవారిలో ఈ ప్రక్రియ ఆలస్యం కావచ్చు. 

కొన్ని రోజుల అతిగా తినడం వల్ల ఏం జరుగుతుంది?
చక్కెరతో పాటు మొత్తం కేలరీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆరోగ్యవంతులైన వ్యక్తులకు ఆరు నుంచి ఏడు రోజుల పాటు అధిక మోతాదులో ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌ అందించి పరిశీలించారు. దీంతో కాలేయంలో కొవ్వు నిల్వలు పెరిగాయి. ఇన్సులిన్‌కు కాలేయం స్పందించే సామర్థ్యం కూడా తగ్గినట్లు గుర్తించారు.

అయితే ఈ పరిశోధనలో ఉపయోగించిన చక్కెర పరిమాణం చాలా ఎక్కువ. సాధారణంగా పండగల్లో ఒకట్రెండు రోజులు స్వీట్లు తినే పరిస్థితిని ఈ ఫలితాలతో నేరుగా పోల్చలేం. అంతేకాదు.. ఈ మార్పులు ఎంతకాలం కొనసాగుతాయనే విషయాన్ని కూడా ఈ అధ్యయనం నిర్ధారించలేదు. 

ప్రీడయాబెటిస్‌ ఉన్నవారు మరింత జాగ్రత్త
డయాబెటిస్‌ వచ్చే ముందు దశలో ఉన్నవారికి రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం ఇప్పటికే కొంత బలహీనంగా ఉంటుంది. ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ కారణంగా శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించవు. ఇలాంటి పరిస్థితుల్లో అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల గ్లూకోజ్‌ నియంత్రణ మరింత కష్టమవుతుంది.

భోజనం తర్వాత షుగర్‌ పెరగడాన్ని సహజమైన ప్రక్రియగా నిపుణులు వివరిస్తున్నారు. అయితే అది ఎంత పెరుగుతోంది? ఎంతసేపటికి తగ్గుతోంది? అన్నది ముఖ్యమని చెబుతున్నారు. భోజనం తర్వాత తరచూ 180 mg/dL కంటే ఎక్కువగా నమోదవుతున్నా, ఎక్కువసేపు తగ్గకపోయినా వైద్యులను సంప్రదించాలి. 

చక్కెరకు బదులుగా బెల్లం, తేనె వాడితే సరిపోదు
తెల్ల చక్కెర మానేసి బెల్లం, తేనె లేదా బ్రౌన్‌ షుగర్‌ తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్‌ పెరగదని అనుకోవడం పొరపాటు. ఇవి కూడా కార్బోహైడ్రేట్ల వనరులే. అలాగే స్వీట్లు మానేసినా అన్నం, బ్రెడ్‌, బంగాళాదుంపలు వంటి పదార్థాలను అధికంగా తీసుకుంటే షుగర్‌ స్థాయులు పెరగవచ్చు. అందుకే ఏ పదార్థం తింటున్నామన్నదే కాకుండా ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యం.

షుగర్‌ నియంత్రణకు ఈ అలవాట్లు పాటించండి
స్వీట్లు, చక్కెర కలిపిన పానీయాలను తగ్గించాలి. అన్నం, ఇతర కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని నియంత్రించాలి.
పప్పులు, కూరగాయలు, ప్రొటీన్‌ ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్ల రసాలకు బదులుగా పండ్లను నేరుగా తినాలి. భోజనం తర్వాత వీలైతే 10–15 నిమిషాలు నడవాలి. తగినంత నిద్రపోవాలి. శారీరక శ్రమను కొనసాగించాలి.

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?
సాధారణ ఆహారపు అలవాట్లకు తిరిగి మారిన తర్వాత కూడా షుగర్‌ స్థాయులు ఎక్కువగా నమోదవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఫాస్టింగ్‌ ప్లాస్మా గ్లూకోజ్‌ 126 mg/dL లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే డయాబెటిస్‌ ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సీ పరీక్ష ద్వారా గత మూడు నెలల్లో రక్తంలో సగటు చక్కెర స్థాయులను అంచనా వేయవచ్చు. ప్రయోగశాల పరీక్షలతో వైద్యులు నిర్ధారించాలి.

తరచూ దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినా వైద్య సలహా తీసుకోవాలి. వాంతులు, కడుపునొప్పి, లోతైన శ్వాస, తీవ్రమైన నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తే అత్యవసర వైద్య సహాయం అవసరం.