ఆంధ్రప్రదేశ్‌లో జీవనశైలి వ్యాధులు ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) 4.0 స్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా 12.23 లక్షల కొత్త హైపర్‌టెన్షన్ (బీపీ), 11.58 లక్షల కొత్త డయాబెటిస్ (షుగర్) కేసులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రూపొందించిన నివేదికను సోమవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు సమర్పించారు.

2025 సెప్టెంబర్ 17 నుంచి 2026 నవంబర్ 10 వరకు, అంటే దాదాపు 14 నెలల పాటు ఈ సర్వే కొనసాగింది. ఇందులో భాగంగా 18 ఏళ్లు పైబడిన సుమారు 2.85 కోట్ల మందికి హైపర్‌టెన్షన్, డయాబెటిస్, నోటి క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. అదనంగా 1.46 కోట్ల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలు చేశారు. ఈ సర్వే తర్వాత రాష్ట్రంలో మొత్తం హైపర్‌టెన్షన్ బాధితుల సంఖ్య 59.63 లక్షలకు (రాష్ట్ర వయోజన జనాభాలో 13.93 శాతం), డయాబెటిస్ బాధితుల సంఖ్య 48.95 లక్షలకు (11.45 శాతం) చేరింది. సుమారు 34 లక్షల మంది రెండు వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది.

ఈ స్క్రీనింగ్‌లో 12,768 క్యాన్సర్ కేసులను కూడా గుర్తించారు. వీటిలో 3,339 నోటి క్యాన్సర్, 5,832 రొమ్ము క్యాన్సర్, 3,597 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో 47.60 శాతం మందికి హైపర్‌టెన్షన్, 43.39 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్లు తేలింది. తూర్పు గోదావరి, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో హైపర్‌టెన్షన్ కేసులు అధికంగా నమోదు కాగా.. డయాబెటిస్ కేసుల్లో తూర్పు గోదావరి, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్ కడప జిల్లాలు ముందున్నాయి.

కుటుంబ సంక్షేమ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ సి. శ్యామల ఈ నివేదికను మంత్రికి అందించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని, జీవనశైలి వ్యాధుల వల్ల కలిగే తీవ్ర పరిణామాలను నివారించడానికి ముందస్తు గుర్తింపు చాలా కీలకమని అధికారులు ఈ సందర్భంగా నొక్కిచెప్పారు.