తెలుగు తెరకి పరిచయమైన మరో హీరో 'కికు యనమల'. ఆయన కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'చిరంజీవి'. ఆరంభంలో ఇదే టైటిల్ అనుకున్నప్పటికీ, కొన్ని అభ్యంతరాల కారణంగా 'కికు చిరంజీవి' అంటూ మార్చారు. కథానాయికగా కషిష్ ఖాన్ నటించిన ఈ సినిమాకి శుభసాయి వెంకట్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 28వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు (నవంబర్ 18వ తేదీ) నుంచి 'జియో హాట్ స్టార్'లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

చిరంజీవి (కికు యనమల) ఒక అనాథ. బాబాయ్ (గోపరాజు రమణ) అతనిని పెంచి పెద్ద చేస్తాడు. మంచి ఫొటోగ్రఫర్ గా 'చిరూ' తన ప్రొఫెషన్ ను కొనసాగిస్తూ ఉంటాడు. ఇక మానస (కశిష్ ఖాన్) కూడా ఒక అనాథనే. ఆమెను ఓ శ్రీమంతుడు ( శ్రీకాంత్ అయ్యంగార్) చేరదీసి పెంచుతాడు. అతని మాట కాదనలేక ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ పిల్లలను కనకూడదని నిర్ణయించుకుంటుంది. అనాథ పిల్లలను దత్తత చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అయినా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒక యువకుడు అంగీకరిస్తాడు. 

ఆ వ్యక్తిని కలవడం కోసం తన స్నేహితులను తీసుకుని హైదరాబాద్ నుంచి 'అరకు' వెళుతుంది మానస. అయితే ఊహించని విధంగా ఆ వ్యక్తి హత్య చేయబడటంతో  ఆమె భయపడిపోతుంది. ఆ సమయంలోనే ఆమెకి చిరంజీవి తారసపడతాడు. అతనితో పరిచయం ఆమెకి భయాన్ని పోగొట్టి భవిష్యత్తుపై ఆశను కలిగిస్తుంది. అయితే ఆ సమయంలోనే అతని గురించిన ఒక నిజం ఆమెకి తెలుస్తుంది. చిరంజీవికి గుండె కుడి వైపున ఉందనీ, అతను వేగంగా పరిగెత్తితే ప్రమాదమని. 

అరకులో ఒక ప్రమాదం బారిన పడిన చిరంజీవిని ఒక డాక్టర్ ( ఈశ్వరీరావు) కాపాడుతుంది. చిరంజీవి ఎవరో కాదు, చిన్నతనంలో తనకి దూరమైన తన కొడుకు అని తెలుసుకుంటుంది. చిరంజీవి కోలుకోగానే దగ్గరుండి మానసతో అతని పెళ్లి జరిపిస్తుంది. అయితే ఫస్టు నైట్ సమయంలో చిరంజీవి గుండె ఎడమ వైపున కొట్టుకోవడం, మరుసటి రోజు నుంచి అతని ప్రవర్తనలో మార్పు రావడం మానస  పసిగడుతుంది. అతను చిరంజీవి కాదనే అనుమానం ఆమెకి కలుగుతుంది. అదే విషయాన్ని స్నేహితులతో పంచుకుంటుంది. 

మానసను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి హత్య చేయబడటంతో, ఆ హత్య గురించిన విచారణ చేపట్టడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా 'వెంకట్' రంగంలోకి దిగుతాడు. ఆ కేసుకు సంబంధించిన సందేహాలు మానస భర్త వైపు చూపిస్తాయి. గతంలో మానసతో ఉన్న పరిచయం కారణంగా, ఈ కేసును వెంకట్ మరింత సీరియస్ గా తీసుకుంటాడు. అతని విచారణలో ఏం తేలుతుంది? చిరంజీవి స్థానంలో ఉన్నదెవరు? చిరంజీవి ఏమయ్యాడు? అనేదే కథ.

ప్రేమ .. పెళ్లి .. పిల్లల విషయంలో మానస ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటుంది. అలాంటి ఆమెకి దగ్గరవుతూ, ఆమె అభిప్రాయాన్ని మార్చేసి పెళ్లి చేసుకుంటాడు చిరంజీవి. అతను తాను ప్రేమించిన వ్యక్తి కాదని గ్రహించిన మానస ఏం చేస్తుంది? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? అనేది ఈ కథలోని ప్రధానమైన అంశం. 

ఈ కథలో హీరో .. హీరోయిన్ .. తనికెళ్ళ భరణి .. ఈశ్వరీరావు అనే నాలుగు బలమైన పాత్రలు కనిపిస్తాయి. ఈ నాలుగు పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అరకు టూర్ .. చిరంజీవి పరిచయం .. బీచ్ లో గొడవ .. ఈశ్వరీరావు ఎంట్రీతో ఈ కథ ఒక కీలమైన మలుపు దగ్గరికి చేరుకుంటుంది. నెక్స్ట్ ఏం జరుగనుందా? అనే ఒక ఉత్కంఠను రేకెత్తిస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. 

ఇక చిరంజీవిపై మానసకి అనుమానం .. భరణి - ఈశ్వరీరావు పాత్రల నేపథ్యం రివిల్ చేయడంతో ఈ కథ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. అప్పటివరకూ సాగిన కథ ఫ్లేవర్ కూడా పూర్తిగా మారిపోతుంది. సైకో .. అతనిని సపోర్టు చేసే పాత్రలతో థ్రిల్లర్ పాళ్లు పెరుగుతూ వెళుతుంది. క్లైమాక్స్ ను కొంతమంది ఆడియన్స్ గెస్ చేయగలిగేలా ఉన్నప్పటికీ, ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ ను చుట్టేయడం .. మరికొన్ని సీన్స్ కాస్త తికమకగా అనిపించడం ఒక లోపంగా అనిపిస్తుంది. 

కికు యనమల .. కశిష్ ఖాన్ .. ఈశ్వరీరావు .. భరణి నటన ఆకట్టుకుంటుంది. రామకృష్ణ ఫొటోగ్రఫీ .. శేఖర్ చంద్ర సంగీతం .. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఫరవాలేదు. ఆరంభంలో కథ కాస్త కొత్తదనం వైపు కనిపించినప్పటికీ, సైకో పాత్ర వైపు టర్న్ అయిన దగ్గర నుంచి రొటీన్ బాటనే పడుతుంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల ఊహకు అందే స్థాయిలోనే డిజైన్ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఓ మాదిరి కంటెంట్ గానే అనిపిస్తుంది.