నేటి యువతలో కంటి సంబంధిత సమస్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా 10 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో ఈ ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. కంటి చికిత్స కోసం వస్తున్న ప్రతి 100 మంది రోగులలో దాదాపు 20 మంది ఈ వయసు వారే ఉంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

గంటల తరబడి మొబైల్ ఫోన్లు వాడటం, వీడియో గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా చూడటం వంటివి కంటి చూపు తగ్గడానికి, ఇన్ఫెక్షన్లకు, తలనొప్పికి దారితీస్తున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు నూడిల్స్, బర్గర్ల వంటి ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం కూడా కళ్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దుమ్ము, ధూళి కూడా సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి.

ఈ అంశంపై కంటి వైద్య నిపుణులు ఏమ‌న్నారంటే!
పిల్లలు అనవసరంగా మొబైల్ వాడటాన్ని తగ్గించాలని నిపుణులు సూచించారు. ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే వారు, దుమ్ము ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా కళ్లకు రక్షణగా అద్దాలు ధరించడం మంచిదని సలహా ఇచ్చారు. తరచుగా తలనొప్పి రావడం లేదా దృష్టిలో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా కళ్లను కాపాడుకోవచ్చనేది నిపుణుల మాట‌.