భారత క్రికెట్ జట్టు వచ్చే ఏడాది ఉత్తర అమెరికాలో సందడి చేయనుంది. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో భాగంగా రెండు T20 మ్యాచ్‌లను అమెరికా లేదా కెనడాలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు ఏడాది ముందు ఈ మ్యాచ్‌లు జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ఆతిథ్యం ఇవ్వనున్న ఈ సిరీస్‌కు సంబంధించి ఒక నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ) 2027-31లో భాగంగా ఈ పర్యటన జరగనుంది. 2027 జులైలో జరిగే ఈ టూర్‌లో టీమిండియా.. వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ ఐదు టీ20ల్లో రెండింటిని ఉత్తర అమెరికాలోని ఒకే వేదికపై నిర్వహించాలని భావిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ, టొరంటో నగరాలు రేసులో ముందుండగా, 2028 ఒలింపిక్స్‌కు క్రికెట్ వేదిక అయిన లాస్ ఏంజిల్స్‌లోని పోమోనాతో పాటు ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌ను కూడా పరిశీలిస్తున్నారు.

ఉత్తర అమెరికాలో క్రికెట్‌ను విస్తరించాలనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) చైర్ కిషోర్ షాలో తెలిపారు. "ఉత్తర అమెరికాలో మార్కెట్‌ను విస్తరించడం మాకు, క్రికెట్‌కు చాలా కీలకం. అక్కడ కరీబియన్, భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని ఆకర్షించడం ద్వారా క్రీడను మరింత అభివృద్ధి చేయవచ్చు" అని ఆయన వివరించారు. రాబోయే ఒలింపిక్స్, టీ20 ప్రపంచకప్‌ల నేపథ్యంలో ఐసీసీ కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.

వెస్టిండీస్ బోర్డు ఇప్పటికే కెనడాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. భవిష్యత్తులో ఓక్లాండ్, వాంకోవర్ వంటి నగరాల్లో కూడా మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి టీ20లకే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఉత్తర అమెరికాలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించే ఆలోచన లేదని నివేదిక స్పష్టం చేసింది. ఇదే ఎఫ్‌టీపీ సైకిల్‌లో భాగంగా 2028లో ఇంగ్లండ్‌తో వెస్టిండీస్ ఆడిన మొట్టమొదటి టెస్టుకు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లార్డ్స్‌లో ఒక ప్రత్యేక మ్యాచ్ ఆడనుండటం విశేషం.