ఏపీలో పురపాలక ఎన్నికలు జరగనున్న 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ప్రభుత్వం నవంబర్ 26న స్థానిక సెలవు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఎన్నికలు జరగనున్న 4 నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుంది. అదేవిధంగా, ఈ ప్రాంతాల్లోని ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు నవంబర్ 26న సెలవు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ ప్రకారం.. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలతో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ అవసరాల కోసం వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం మరో ఉత్తర్వులో పేర్కొంది.

కాగా, అదే రోజు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది.