అర్ణబ్ తుపాను సృష్టించిన బీభత్సంలో వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, దట్టమైన అటవీ ప్రాంతంలో ఆహారం లేకుండా కేవలం నీటినే తాగుతూ ఏకంగా 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. ఒడిశాలోని కంథమాల్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ అద్భుత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

కంథమాల్ జిల్లా రాయికియా బ్లాక్‌ పరిధిలోని దుబా ప్రాథమిక పాఠశాలలో మోహన్ మహారాణా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అక్టోబర్ 28న కురిసిన భారీ వర్షాల సమయంలో ఆయన పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో అర్ణబ్ తుపాను కారణంగా వచ్చిన వరద ప్రవాహంలో ఆయన కొట్టుకుపోయారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వరద నీటిలోనే కొట్టుకుపోయిన మహారాణా, మార్గమధ్యంలో నీటిలో తేలియాడుతున్న ఓ చెట్టు కొమ్మను పట్టుకోగలిగారు. అతి కష్టం మీద నీటి నుంచి బయటకు వచ్చి ఒడ్డుకు చేరుకున్నప్పటికీ, చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో బయటకు వచ్చే దారి దొరకలేదు.

ఆ ప్రాంతంలో ఓ రాళ్ల సందును ఆశ్రయంగా మార్చుకున్న ఆయన, 15 రోజుల పాటు అక్కడే గడిపారు. తినడానికి ఆహారం ఏమీ లేకపోవడంతో సమీపంలోని సహజసిద్ధమైన ఊట నీటిని మాత్రమే తాగుతూ జీవనం సాగించారు. ఎవరైనా కాపాడతారేమోనన్న ఆశతో ఆయన పలుమార్లు గట్టిగా కేకలు వేసినప్పటికీ, అది నిర్మానుష్యమైన దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆ ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు.

ఈ క్రమంలో శుక్రవారం నాడు రాతంగి గ్రామానికి చెందిన ఇద్దరు పశువుల కాపరులు అడవిలోకి వెళ్లగా, రాళ్ల సందులో తీవ్ర అస్వస్థతతో పడివున్న మహారాణాను గమనించారు. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం, గ్రామస్తులు కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా నీరసించిపోయిన ఉపాధ్యాయుడిని ఓ గుడ్డతో చేసిన జోలిలో ఉంచి, దాదాపు 8 నుంచి 9 కిలోమీటర్ల మేర ఎత్తైన కొండలు, గుట్టల గుండా మోసుకుంటూ తీసుకొచ్చారు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం రాయికియా సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

15 రోజుల పాటు ఆకలితో అలమటించడం వల్ల మహారాణా దాదాపు 10 నుంచి 15 కిలోల బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన శరీరం తీవ్ర బలహీనంగా ఉన్నప్పటికీ, పరిస్థితి నిలకడగానే ఉందని, కొద్దికొద్దిగా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. అక్టోబర్ 28 నుంచి ఆయన ఆచూకీ కోసం గాలించి, ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు ఆయన ప్రాణాలతో తిరిగొచ్చిన వార్త తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ మహారాణా మాట్లాడుతూ.. వరదలో కొట్టుకుపోయిన తర్వాత రాళ్ల మధ్య ఒక ఎండిన నదీ తీరంలో స్పృహలోకి వచ్చానని, చుట్టూ అడవి ఉండటంతో బయటపడే దారి కనిపించలేదని తెలిపారు. కేవలం ఊట నీరు మాత్రమే దొరకడంతో దాన్నే తాగి బతికానని గుర్తుచేసుకున్నారు. తాను త్వరగా కోలుకుని, మళ్లీ పాఠశాలకు వెళ్లి తన విద్యార్థులను కలుసుకోవాలని ఉందని ఆయన ఆకాంక్షించారు.