తిరుచ్చిరాపల్లి జిల్లాలో శిథిలావస్థకు చేరిన పురాతన చోళీశ్వర ఆలయానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు రూ. 6.8 కోట్ల వ్యయంతో ఈ ఆలయ పునరుద్ధరణ పనులను చేపట్టనుంది. ఆలయ వాస్తుశిల్ప విశిష్టతను కాపాడుతూ, నిర్మాణాన్ని పటిష్ఠం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

తిరుచ్చి జిల్లా లాల్గుడి తాలూకా వి.తురైయూర్‌లోని అరుళ్‌మిగు చోళీశ్వర ఆలయం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో, హిందూ మత, ధర్మాదాయ శాఖ (హెచ్ఆర్ అండ్ సీఈ) గత వారం టెండర్లను ఆహ్వానించింది. ఈ పునరుద్ధరణ పనులను 24 నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

స్థానిక పరిశోధకుల అంచనా ప్రకారం, ఈ ఆలయం సుమారు 800 నుండి 1000 ఏళ్ల నాటిదిగా భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం, రాతి శిల్పాలు చోళుల కాలం నాటి వాస్తు శైలిని ప్రతిబింబిస్తున్నాయని పురావస్తు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఆలయం తీవ్రంగా శిథిలమవడంతో దాని చారిత్రక ప్రాముఖ్యతపై లోతైన అధ్యయనం చేయడం ఇప్పటివరకు సాధ్యపడలేదు.

రాష్ట్రవ్యాప్తంగా 64 పురాతన ఆలయాల పరిరక్షణకు గాను 2025-26 బడ్జెట్‌లో కేటాయించిన రూ. 125 కోట్ల నిధులలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ పనుల కోసం శాఖ వద్ద నమోదైన స్థపతులు, శిల్పులతో పాటు అర్హత కలిగిన కాంట్రాక్టర్ల నుండి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పునరుద్ధరణ పనులు ఆలయ నిర్మాణాన్ని కాపాడటమే కాకుండా, దాని చరిత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి నిపుణులకు వీలు కల్పిస్తుందని హెచ్‌ఆర్‌సీఈ అధికారి ఒకరు వెల్లడించారు.