బలోచిస్థాన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వానికి పెను సవాల్ విసురుతున్న బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), పాక్ సైనిక వర్గాలను నివ్వెరపరిచే నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేసిన రెహ్మాన్ గుల్‌ను తమ కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా నియమించింది. 

ఈ నియామకం బలోచిస్థాన్‌లో పోరాట స్వరూపాన్నే మార్చేసే కీలక పరిణామమని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీఎల్ఏ కేవలం నాయకత్వాన్ని మార్చడమే కాకుండా, తన దాడి వ్యూహాలు, ఆయుధ సంపత్తి, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలోనూ సమూల మార్పులు చేపట్టి పాక్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

గతంలో ఐఈడీలు, మెరుపు దాడులకే పరిమితమైన బీఎల్ఏ, ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంది. సైనిక అవసరాల కోసం మార్పులు చేసిన క్వాడ్‌కాప్టర్లను (డ్రోన్లు) పాక్ భద్రతా దళాల కాన్వాయ్‌లపై దాడులకు ఉపయోగిస్తోంది. మానవ రహిత గగనతల పరికరాలతో సైనిక గస్తీ బృందాలను లక్ష్యంగా చేసుకోవడం వారి దాడులను మరింత ప్రాణాంతకంగా మార్చిందని ఓ అధికారి తెలిపారు. దీంతో పాక్ సైన్యంలో ప్రాణనష్టం గణనీయంగా పెరిగింది.

బీఎల్ఏ తన సామ‌ర్థ్యాల‌ను పెంచుకునేందుకు పాక్ సైన్యంలోని అనుభవజ్ఞులనే లక్ష్యంగా చేసుకుంది. సైన్యంలో పనిచేస్తున్న అసంతృప్త అధికారులు, సిబ్బందిని గుర్తించి, వారిని తమ వైపు తిప్పుకోవడానికి బీఎల్ఏలో ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 

బలోచిస్థాన్‌లో పాక్ ప్రభుత్వం, సైన్యం వ్యవహరిస్తున్న తీరుపై చాలామంది సైనికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బలోచ్ ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, బలవంతపు అదృశ్యాలు, అభివృద్ధిని విస్మరించడం వంటి కారణాలతో పలువురు సైన్యాన్ని వీడేందుకు సిద్ధమవుతున్నారని, ఇదే బీఎల్ఏకు అవకాశంగా మారిందని తెలుస్తోంది.

కొత్త చీఫ్‌గా నియమితుడైన రెహ్మాన్ గుల్ అలియాస్ మురీద్ బలోచ్, గతంలో పాక్ సైన్యంలోని 19వ ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో కమిషన్డ్ ఆఫీసర్‌గా పనిచేశారు. బలోచిస్థాన్ సమస్యపై పాక్ ప్రభుత్వ వైఖరి నచ్చకే ఆయన సైన్యం నుంచి ఫిరాయించి కొంతకాలం కిందట బీఎల్ఏలో చేరారు. స్వల్పకాలంలోనే తన ప్రతిభతో రెండో కమాండర్‌గా ఎదిగి, బీఎల్ఏకు చెందిన ప్రమాదకరమైన 'మజీద్ బ్రిగేడ్' రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 

పాక్ సైనిక వ్యూహాలపై పూర్తి అవగాహన ఉన్న గుల్ నియామకం, సైన్యంలోని ఇతర అసంతృప్తులు కూడా బీఎల్ఏలో చేరేందుకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ పరిణామం బలోచిస్థాన్‌లోని సహజ వనరులను విదేశాలకు అప్పగించాలనుకుంటున్న పాక్ ప్రణాళికలకు పెను సవాల్‌గా మారింది.