నల్గొండ జిల్లాలో మొబైల్ టవర్ల నుంచి అత్యంత విలువైన పరికరాలను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌లో పనిచేస్తున్న ప్రస్తుత, మాజీ ఉద్యోగులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 1.62 కోట్ల విలువైన టవర్ పరికరాలతో పాటు నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. టవర్లలో కీలకమైన పరికరాలు మాయమవుతున్నాయన్న ఫిర్యాదులతో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి నేతృత్వంలో రెండు ప్రత్యేక క్రైమ్ కంట్రోల్ స్క్వాడ్ (CCS) బృందాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 14న నిర్వహించిన ముమ్మర వాహన తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడింది.

అరెస్టయిన వారిలో ముగ్గురు ఇంజనీర్లు, నలుగురు టవర్ రిగ్గర్లు/టెక్నీషియన్లు, ఒక డ్రైవర్‌తో పాటు ఒక మాజీ ఎయిర్‌టెల్ ఉద్యోగి ఉన్నారు. వీరంతా తాము పనిచేస్తున్న సంస్థలోని సాంకేతిక అంశాలు, టవర్ల వద్ద ఉండే పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటంతో ఈ చోరీలకు పథకం వేశారు. రాత్రి వేళల్లో టవర్ లొకేషన్లకు వెళ్లి, నెట్‌వర్క్ కనెక్టివిటీకి అత్యంత కీలకమైన రేడియో రిమోట్ యూనిట్లను (RRU) సులువుగా తొలగించేవారు.

విచారణలో నిందితులు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 38 చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ఇందులో మిర్యాలగూడలో 16, నల్గొండలో 9, సూర్యాపేటలో 8, దేవరకొండలో 2, ఇతర జిల్లాల్లో 3 కేసులు ఉన్నాయి. ఇప్పటికే త్రిపురారం, నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయి.

టవర్ల నుంచి దొంగిలించిన ఖరీదైన పరికరాలను వీరు హైదరాబాద్‌లో విక్రయించేవారు. అలా వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన కార్లు, బైకులు కొనుగోలు చేసి జల్సాలు చేసేవారని పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి దాదాపు రూ. 25 లక్షల విలువైన 3 కార్లు, 2 మోటార్ సైకిళ్లు, రూ. 15 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.