టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌ తన పెళ్లికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాడు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని వద్దకు వెళ్లిన రింకూ.. తన వివాహ ఆహ్వాన పత్రికను అందించి ఆశీస్సులు తీసుకున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో అతడి వివాహం డిసెంబర్‌ 4న లక్నోలో జరగనుంది.

ప్రధానితో భేటీకి సంబంధించిన ఫొటోను రింకూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. కుటుంబంతో కలిసి మోదీని కలవడం, పెళ్లికి ఆహ్వానించి ఆయన ఆశీస్సులు తీసుకోవడం తమకు ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నాడు.

వివాహ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే రింకూ కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి పెళ్లి పత్రిక అందించారు. రింకూ తల్లి బీనా దేవి, సోదరుడు సోనూ సింగ్‌, సోదరి నేహా సింగ్‌ లక్నోలోని సీఎం నివాసానికి వెళ్లి ఆయనను వివాహానికి ఆహ్వానించారు.

లక్నోలోని రమదా హోటల్‌లో రింకూ, ప్రియా వివాహ వేడుక జరగనుంది. క్రికెట్‌, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. గతేడాది జూన్‌ 8న లక్నోలోని ‘ది సెంట్రమ్‌’ హోటల్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది.

తమ ప్రేమకథ గురించి రింకూ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కరోనా సమయంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం ముంబైలో ఉన్నప్పుడు ఓ ఫ్యాన్‌ పేజీలో ప్రియా ఫొటో చూశానని చెప్పాడు. ఆమె తన ఫొటోలకు లైక్‌లు ఇవ్వడంతో సందేశం పంపేందుకు ధైర్యం వచ్చిందన్నాడు. అలా మొదలైన పరిచయం క్రమంగా మాటలుగా మారి ప్రేమకు దారితీసిందని వివరించాడు.

రింకూ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు ప్రియా స్టేడియాలకు వచ్చి ప్రోత్సహిస్తుంటారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున రింకూ ఆడినప్పుడు కూడా ఆమె ప్రేక్షకుల మధ్య కనిపించారు.

జింబాబ్వే పర్యటనలో భారత్‌ తరఫున చివరిసారిగా ఆడిన రింకూ.. త్వరలో మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. నవంబర్‌ 19 నుంచి 29 వరకు దోహాలో జరిగే ఏసీసీ రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌ కోసం భారత ‘ఏ’ జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.