హైదరాబాద్‌ శివారు బౌరంపేటలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ పార్కింగ్ యార్డులో నిలిపి ఉంచిన ఐదు ట్రావెల్స్ బస్సులు మంటలకు ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్రాయి సమీపంలో గల పార్కింగ్ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులను ఒకదానికొకటి అతి సమీపంలో నిలిపి ఉంచడంతో, ఒక బస్సులో మొదలైన మంటలు శరవేగంగా ఇతర బస్సులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మూడు బస్సులు పూర్తిగా దగ్ధం కాగా, మరో రెండు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

అర్ధరాత్రి సమయంలో దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు, సమీపంలోని పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించారు. జీడిమెట్ల ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, బస్సుల సమీపంలోని చెత్తకుప్పకు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించి ఉండవచ్చనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, జరిగిన ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.