ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ ఓ సమావేశంలో భారత సంతతికి చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ జే పురీపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 30 మందికి పైగా ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో పురీని ఉద్దేశించి హువాంగ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ‘న్యూయార్క్‌ పోస్ట్‌’ కథనం పేర్కొంది. దీంతో అసలు జే పురీ ఎవరు? ఎన్విడియాలో ఆయన ఏ బాధ్యతలు నిర్వహించారు? అనే ఆసక్తి నెలకొంది.

ఎన్విడియాలో 2 దశాబ్దాల ప్రస్థానం
జే పురీ సుదీర్ఘ అనుభవం ఉన్న టెక్నాలజీ రంగ నిపుణుడు. 2005లో ఎన్విడియాలో చేరిన ఆయన.. తొలుత ప్రపంచవ్యాప్త విక్రయాల విభాగానికి సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సంస్థలో ఎదుగుతూ వరల్డ్‌వైడ్‌ ఫీల్డ్‌ ఆపరేషన్స్‌ విభాగానికి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి చేరుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్విడియా విక్రయాలు, వ్యాపార అభివృద్ధి, కస్టమర్లతో సంబంధాలు, ఫీల్డ్‌ కార్యకలాపాలను పర్యవేక్షించడం ఆయన బాధ్యతల్లో భాగం. సంస్థ వాణిజ్య కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. 2026 ఆగస్టులో ఆ ఎగ్జిక్యూటివ్‌ పదవి నుంచి తప్పుకొని సీనియర్‌ అడ్వైజర్‌ బాధ్యతలు చేపట్టారు.

ఎన్విడియాకు ముందు సన్‌ మైక్రోసిస్టమ్స్‌లో..
ఎన్విడియాలో చేరకముందు జే పురీ 22 ఏళ్ల పాటు సన్‌ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేశారు. అక్కడ విక్రయాలు, మార్కెటింగ్‌, జనరల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో పలు కీలక పదవులు నిర్వహించారు. ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, నిహోన్‌ సన్‌ కేకే అధ్యక్షుడిగా, సాఫ్ట్‌వేర్‌, టెక్నాలజీ విభాగాల ప్రపంచవ్యాప్త విక్రయాల వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

తొలినాళ్లలో హ్యూలెట్‌ ప్యాకర్డ్‌ (హెచ్‌పీ), బూజ్‌ అలెన్‌ అండ్‌ హామిల్టన్‌, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ సంస్థల్లోనూ పనిచేశారు. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ రంగాల్లో అనుభవం సంపాదించారు.

హువాంగ్‌ వ్యాఖ్యలతో వెలుగులోకి..
జే పురీ పేరు తాజాగా వార్తల్లోకి రావడానికి కారణం ఎన్విడియా మాజీ అధిపతి జెన్సన్‌ హువాంగ్‌ చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలే. గత ఫిబ్రవరిలో జరిగిన అంతర్గత సమావేశంలో పురీని లక్ష్యంగా చేసుకుని హువాంగ్‌ తీవ్రంగా మాట్లాడినట్లు ‘న్యూయార్క్‌ పోస్ట్‌’ కథనం పేర్కొంది. ఆ సమావేశం గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ.. “నీకు ఫ్లూ రావాలని, అది మరింత తీవ్రం కావాలని కోరుకుంటున్నా” అని హువాంగ్‌ అన్నట్లు తెలిపింది. మరో కథనం ప్రకారం.. “నువ్వు చనిపోతే మనందరికీ ఈ బాధ తప్పుతుంది” అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.

ఈ మాటలు వినిపిస్తున్న సమయంలో పురీ మౌనంగా ఉన్నట్లు సమాచారం. హువాంగ్‌ సమావేశాల్లో తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగులను సహచరుల ముందే మందలించేవారని సమాచారం. అయినప్పటికీ పురీపై చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేశాయని ఓ వ్యక్తి తెలిపారు.  గతంలో ఓ ఆగ్రహావేశంలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌పై నీళ్ల బాటిల్‌ విసిరినట్లు కూడా నివేదికలు వచ్చాయి.