2018లో క్రికెట్‌ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం మరోసారి దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) విచారణ సక్రమంగా జరగలేదంటూ మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తీవ్ర ఆరోపణలు చేశాడు. అప్పట్లో జట్టు ప్రధాన పేసర్లు జోష్‌ హేజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయన్‌లను కనీసం విచారించలేదని.. అలాంటప్పుడు వారికి ఈ కుట్ర గురించి తెలియదని ఎలా నిర్ధారించారని ప్రశ్నించాడు. ముందుగానే ఎవరిని దోషులుగా చూపించాలో నిర్ణయించుకుని విచారణ జరిపినట్లు కనిపిస్తోందని మండిపడ్డాడు.

ఉస్మాన్‌ ఖవాజా తన ఆత్మకథ 'సబ్ర్‌ ' విడుదల చేయడంతో 2018 బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ కుట్ర గురించి అప్పట్లో శిక్ష ఎదుర్కొన్న స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌లకే కాకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లోని అందరికీ తెలుసని ఖవాజా పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన వార్నర్‌.. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణ తీరును తప్పుబట్టాడు.

2018 విచారణలో హేజిల్‌వుడ్‌, స్టార్క్‌, లయన్‌లను ప్రశ్నించలేదని వార్నర్‌ చెప్పాడు. అదే నిజమైతే బౌలర్లకు ఈ విషయం తెలియదని సీఏ ఎలా చెబుతుందని నిలదీశాడు. విచారణ లోపభూయిష్టంగా సాగిందని, ఇప్పుడు కూడా బౌలర్లకు ఏమీ తెలియదనే తప్పుడు కథనాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. ఇది ఏదో కప్పిపుచ్చే ప్రయత్నంలా ఉందని వ్యాఖ్యానించాడు.

మరోవైపు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించాడు. మైదానంలో శాండ్‌పేపర్‌ వినియోగం గురించి ఆటగాళ్లకు తెలుసన్న ఖవాజా వాదన తప్పని కొట్టిపారేశాడు. కెప్టెన్సీలో జాతి వివక్ష ఉందన్న ఖవాజా ఆరోపణలపైనా ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశాడు. వ్యక్తుల జీవితాలు, ప్రతిష్ఠల విషయంలో ఖవాజా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడని విమర్శించాడు.

ఇదిలా ఉంటే శుక్రవారం ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ తొలి వన్డే సందర్భంగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన వార్నర్‌.. ఖవాజా చెప్పిన విషయాలు వంద శాతం నిజమని సమర్థించాడు. కమిన్స్‌ ఖవాజాను ఒంటరిని చేస్తున్నాడని ఆరోపించాడు.