అమెరికాలో వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి మరోసారి స్పష్టమైంది. 2026 ఆర్థిక సంవత్సరంలో 'ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్' (ఐసీఈ) ఏజెన్సీ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో వలసదారులను దేశం నుంచి బహిష్కరించడంతో పాటు అరెస్టులు కూడా చేపట్టింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారికంగా గణాంకాలను విడుదల చేసింది.

హోంల్యాండ్ సెక్యూరిటీ వివరాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 4,83,200 మందిని దేశం నుంచి బహిష్కరించారు. 'ఐస్' ఏజెన్సీ 23 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధికం. గత ఏడాది నమోదైన 4,42,640 బహిష్కరణల రికార్డును ఇది అధిగమించింది. ఇదే సమయంలో అరెస్టుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో 4,91,000 దాటింది. వీటిలో సుమారు 4,75,000 అడ్మినిస్ట్రేటివ్ అరెస్టులు కావడం గమనార్హం. ముఖ్యంగా ఆగస్టు 2026లో 50,925 మందిని అరెస్ట్ చేయగా, సెప్టెంబర్ నెలలో 48,000కు పైగా అరెస్టులు నమోదయ్యాయి.

ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలపై తీసుకున్న క‌ఠిన చర్యల కారణంగానే ఈ రికార్డు స్థాయి అరెస్టులు, బహిష్కరణలు సాధ్యమయ్యాయని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని మూడు పూర్తి ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన మొత్తం అరెస్టులు, బహిష్కరణల కంటే ఈ ఏడాది గణాంకాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన నొక్కిచెప్పారు.

ఈ ప్రకటన వెలువడటానికి కొద్ది రోజుల ముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వ వలస విధానాలు 'కొంత కఠినంగా ఉండవచ్చని' అంగీకరించారు. అయితే, చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన వారిని తొలగించే ప్రయత్నాలను ఆయన సమర్థించుకున్నారు.

మరోవైపు, కాంగ్రెస్‌లో పట్టు పెంచుకుంటున్న డెమొక్రాట్లు ఈ పరిణామాలపై దృష్టి సారించారు. 'ఐస్' ఏజెన్సీ అనుసరిస్తున్న పద్ధతులు, కఠిన నిబంధనలపై సమీక్ష జరపాలని యోచిస్తున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. విడుదలైన డేటాలో దేశ సరిహద్దుల్లో పట్టుబడిన వారు, దేశ అంతర్గతంగా అరెస్ట్ అయిన వారి మధ్య స్పష్టమైన విభజన లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వలసదారులపై ప్రభుత్వ చర్యల పూర్తి స్వరూపంపై కొంత అస్పష్టత నెలకొంది.