కేవలం బిడ్డకు అమెరికా పౌరసత్వం ఇప్పించే లక్ష్యంతో అక్కడకు ప్రయాణించే 'బర్త్ టూరిజం'పై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు 6 వేల‌కు పైగా వీసాలను రద్దు చేసినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న లేదా ప్రోత్సహించిన విదేశీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

'బర్త్ టూరిజం ప్రివెన్షన్ టాస్క్‌ఫోర్స్' ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొంది. ఈ అక్రమ విధానంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ గుర్తించి బాధ్యులను చేస్తామని తెలిపింది. అక్టోబర్ 31 నాటికి 4,000 వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించగా, కేవలం పదిహేను రోజుల్లోనే మరో 2,000 వీసాలను రద్దు చేయడం గమనార్హం. అయితే, గతంలో రద్దు చేసిన వాటిలో 700కు పైగా చైనా జాతీయులకు చెందిన వీసాలు ఉన్నాయని తెలిపి, తాజా ప్రకటనలో మాత్రం దేశాల వారీగా వివరాలు వెల్లడించలేదు.

ఈ సమస్యను అరికట్టేందుకు ఆగస్టు 12న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయగా, సెప్టెంబర్ 23న విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొత్త వీసా ఆంక్షలను ప్రకటించారు. ఈ నిబంధనల ప్రకారం కేవలం అమెరికాలో ప్రసవించడం కోసమే ప్రయాణిస్తున్నారని కాన్సులర్ అధికారికి బలమైన అనుమానం కలిగితే, వారికి 'బి నాన్-ఇమ్మిగ్రెంట్' వీసా జారీ చేయడాన్ని నిరాకరించవచ్చు. అలాగే, ఈ అక్రమాలపై సమాచారం ఇచ్చేందుకు ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు.

అయితే, వీసా రద్దు అనేది కేవలం పరిపాలనాపరమైన చర్య మాత్రమేనని, దీనివల్ల ఆ వ్యక్తిని దేశం నుంచి బహిష్కరించినట్లుగా లేదా నేరానికి పాల్పడినట్లుగా నిర్ధారణ కాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ కొత్త నిబంధనల వల్ల, అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం లభించే విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని కూడా వివరించారు.