తెలంగాణ ప్రభుత్వం పట్టణ పేదలకు తీపి కబురు అందించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) వెలుపల ఉన్న ఐదు ప్రధాన నగరాల్లో 'ఇందిరమ్మ ఇండ్లు టవర్స్' పథకం కింద మొదటి విడతలో 2,400 ఫ్లాట్ల నిర్మాణానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు డిమాండ్ సర్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ఒక్కో అర్హత కలిగిన కుటుంబానికి రూ.5 లక్షల సబ్సిడీతో పాటు ఉచితంగా స్థలాన్ని సమకూరుస్తున్నారు. లబ్ధిదారుడి వాటాగా కేవలం రూ.3.50 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకం కింద నిజామాబాద్ (నాగారం - ఆర్‌జీకే కాలనీ), వరంగల్ (గొర్రెకుంట), హనుమకొండ (మడికొండ), నల్గొండ (మామిళ్లగూడ), మహబూబ్‌నగర్ (బండమీదిపల్లి)లలో ఒక్కో ప్రాంతంలో 480 చొప్పున ఫ్లాట్లను నిర్మించనున్నారు. జీ+5 లేదా అంతకంటే ఎక్కువ అంతస్తుల్లో నిర్మించే ప్రతి ఫ్లాట్ రిజిస్ట్రబుల్ విస్తీర్ణం 512 చదరపు అడుగులుగా ఉంటుంది.

కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించని వారు, సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి సొంతిల్లు లేదా నివాస స్థలం లేని స్థానికులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. లబ్ధిదారుడి వాటా అయిన రూ.3.50 లక్షలను నాలుగు విడతల్లో చెల్లించవచ్చు. తాత్కాలిక కేటాయింపు సమయంలో రూ.1 లక్ష, ఆర్సీసీ నిర్మాణం పూర్తయ్యాక రూ.1 లక్ష, ఫినిషింగ్ దశలో రూ.1 లక్ష, ఫ్లాట్ అప్పగించే సమయంలో మిగిలిన రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం బ్యాంక్ రుణాలు పొందే వెసులుబాటు కూడా కల్పించారు. ఫ్లాట్ కేటాయించిన తర్వాత 10 ఏళ్ల వరకు దానిని విక్రయించడం కానీ, అద్దెకు ఇవ్వడం కానీ చేయకూడదు.

అర్హత కలిగిన లబ్ధిదారులు రూ.100 దరఖాస్తు రుసుము, రూ.10,000 ఈఎండీ డిపాజిట్ చెల్లించి మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్లాట్ రానివారికి ఈ ఈఎండీ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం లక్కీ డ్రా (లాటరీ), క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తుది కేటాయింపులు చేపడతారు. దరఖాస్తుల సమర్పణకు డిసెంబర్ 5, 2026 చివరి తేదీ. పూర్తి వివరాలు, సందేహాల కోసం హౌసింగ్ బోర్డు హెల్ప్‌లైన్ నంబర్ 040-24603572 లేదా అధికారిక వెబ్‌సైట్ tghb.telangana.gov.in ను సంప్రదించవచ్చు.