జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలోని చిన్నారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేక సందేశాలను పంచుకున్నారు.

"నేటి బాలలే రేపటి పౌరులు.. దేశానికి భవిత" అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. చిన్నారుల కలలను సాకారం చేస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికత, నైపుణ్యాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను మేళవించిన విద్యను అందించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బాలల అభ్యున్నతితోనే రాష్ట్ర, దేశ ప్రగతి సాధ్యమని, వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించే లక్ష్యంతో కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు.

మంత్రి నారా లోకేశ్ సైతం చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. "రేపటి ఉజ్వల భవిష్యత్తుకు మీరే పునాదులు" అని ఆయన అభివర్ణించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని, చిన్నారుల కళ్లలోని అమాయకత్వం, వారి చిరునవ్వులోని స్వచ్ఛత ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.