రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎక్స్‌ఛేంజ్’ (APEX) కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని వినూత్న ఆవిష్కరణలు, స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఉద్దేశించిన ఈ వేదికలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విశేష ప్రతిభ కనబరిచిన 6 అంకుర సంస్థల నిర్వాహకులను మంత్రి లోకేశ్ ప్రత్యేక జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ-2024 కింద ఎంపికైన 31 స్టార్టప్‌లకు తొలి విడతగా రూ.2.11 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన అప్రూవల్ పత్రాలు, చెక్కులను మంత్రి స్వయంగా ఆయా సంస్థల వ్యవస్థాపకులకు అందజేశారు.

25 రంగాల్లో పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లు
కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమగ్ర పారిశ్రామిక వృద్ధి కోసం 25 వేర్వేరు రంగాల్లో ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. సిమెంట్ వంటి సంప్రదాయ రంగాలతో పాటు అత్యాధునిక క్వాంటం టెక్నాలజీ వరకు వీటిని విస్తరిస్తున్నామని చెప్పారు. స్టీల్, పునరుత్పాదక ఇంధనం, సోలార్ సెల్స్, వేఫర్ తయారీ, ఎయిర్ కండిషనింగ్, ఆక్వా, మెడికల్ డివైజెస్, ఫార్మా, డేటా రంగాల్లో బలమైన వ్యవస్థను నిర్మిస్తున్నామని వివరించారు.

ఏ పరిశ్రమకైనా ముడి సరుకు సరఫరా వ్యవస్థ అత్యంత కీలకమని, మొబైల్ ఫోన్ తయారీ ఉదాహరణను ప్రస్తావిస్తూ దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలోనే విడిభాగాలు, అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ వంటి పూర్తి సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉండేలా క్లస్టర్లను తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో లభించే బీచ్ శాండ్ ఆధారిత రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాలు త్వరలోనే ప్రారంభమవుతాయని, ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనల కోసం ప్రపంచ స్థాయి విద్యాసంస్థలతో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ (SMR) రంగంలోనూ అంతర్జాతీయ స్థాయి ఇంజనీర్లను ఏపీ నుంచే తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు.

రతన్ టాటా విలువలే స్ఫూర్తి
దివంగత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రతి భారతీయుడికి గర్వకారణమని, ఆయన చూపిన విలువలు, నిజాయతీతో కూడిన వ్యాపార దృక్పథమే తమకు నిరంతర స్ఫూర్తి అని మంత్రి పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఈ నూతన ఆవిష్కరణల హబ్‌కు ఆయన పేరు పెట్టినట్లు చెప్పారు. స్పేస్ సెక్టార్‌లో స్కైరూట్ సంస్థకు నమ్మకంతో 300 ఎకరాలు కేటాయించామని, అలాగే సముద్ర ఆధారిత డ్రోన్లను తయారుచేస్తున్న సాగర్ డిఫెన్స్ త్వరలోనే ఐపీవోకు వెళ్లబోతోందని ఉదహరించారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తే భూ కేటాయింపులు, గ్లోబల్ ఎక్స్‌పోజర్, వెంచర్ క్యాపిటలిస్టులతో అనుసంధానం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ సందర్శన
అంతకుముందు సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్‌ను మంత్రి లోకేశ్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజనీరింగ్, అగ్రి-టెక్, మెడ్-టెక్, ఉమెన్ ఎంటర్‌ప్రైజెస్ స్టాళ్లను సందర్శించి ఉత్పత్తుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. క్వాంటం కంప్యూటింగ్ విడిభాగాలు, వాయిస్ కమాండ్ ఆధారిత ఏఐ డ్రోన్లు, స్టేషన్ హైడ్రాలిక్ పవర్ ప్యాక్, ఎడ్యుకేషనల్ రోబోట్స్ వంటి పరికరాలను ఆసక్తిగా వీక్షించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ముచ్చటిస్తూ.. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ఎం.సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.