హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నగరంలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టుపై అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఏడాదిలోగా తొలి దశను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం గడువు విధించారు.

ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు వ్యవస్థకు అనుబంధంగా, చివరి గమ్యస్థానానికి (లాస్ట్ మైల్), స్వల్ప దూర ప్రయాణాలకు ఈ పీఆర్‌టీఎస్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నగరంలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాలు, పర్యాటక ప్రాంతాల మధ్య సులభమైన, వేగవంతమైన రాకపోకలను సాధ్యం చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ వ్యవస్థతో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రతిపాదిత కారిడార్లు ఇవే.. 
తొలి దశలో భాగంగా అధికారులు నాలుగు కీలక కారిడార్లను ప్రతిపాదించారు. 

ఒకటి: ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా రాణిగంజ్ బస్ స్టేషన్ వరకు. రెండు: అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి రవీంద్రభారతి, సచివాలయం, ఐమ్యాక్స్ మీదుగా బేగంపేట వరకు. 
మూడు: పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ల వరకు.

ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే కేపీహెచ్‌బీ - మైండ్‌స్పేస్ మార్గాన్ని తక్షణమే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కార్యకలాపాలకు మద్దతుగా నెక్లెస్ రోడ్ మరియు గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో ప్రత్యేక డిపోలతో కూడిన మల్టీ-లెవల్ పార్కింగ్ సముదాయాలను నిర్మించాలని కూడా ప్రతిపాదించారు. నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.