ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ రంగం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భవిష్యత్ అవసరాలకు కీలకమైన ఖనిజాల సేకరణలో భారత్ అత్యంత చురుగ్గా వ్యవహరిస్తోంది. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు భారత్ మొత్తం 15 క్రిటికల్ మినరల్స్ ఒప్పందాలపై సంతకాలు చేసి గ్లోబల్ రేసులో అగ్రగామిగా నిలిచింది. క్లైమేట్ యాక్షన్ లైవ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, అంతర్జాతీయంగా కీలక ఖనిజ వనరులను చేజిక్కించుకోవడంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది.

ఈ జాబితాలో 41 ఒప్పందాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. 11 ఒప్పందాలు మాత్రమే చేసుకున్న చైనా, కెనడా, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్ వంటి ప్రధాన దేశాలను భారత్ వెనక్కి నెట్టింది.

ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక బ్యాటరీలు, విండ్ టర్బైన్లు, విద్యుత్ గ్రిడ్లు, సెమీకండక్టర్ల తయారీకి లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్, రాగి, అరుదైన భూ ఖనిజాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) చాలా కీలకం. దేశీయంగా వీటి లభ్యత తక్కువగా ఉండటంతో, తన స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి విదేశీ వనరులను సురక్షితం చేసుకోవడమే ఏకైక మార్గమని భారత్ భావిస్తోంది.

ఈ లక్ష్యాల కోసం జనవరి 2025లో కేంద్ర ప్రభుత్వం 'నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్'ను ఆమోదించింది. 2024-25 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగే ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం రూ.16,300 కోట్లు కేటాయించనుంది. దీనికి అదనంగా ప్రభుత్వ రంగ సంస్థలు మరో రూ.18,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దేశీయంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో 1,200 అన్వేషణ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. వీటితో పాటు విదేశాల్లో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 26, ప్రైవేట్ సంస్థల ద్వారా మరో 24 మైనింగ్ ఆస్తులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ వ్యూహంలో భాగంగా అంతర్జాతీయ భాగస్వామ్యాలను భారత్ విస్తరిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కబిల్) అర్జెంటీనాకు చెందిన కామ్యెన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కటమార్కా ప్రావిన్స్‌లోని 15,703 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఐదు లిథియం బ్లాకులను అన్వేషించేందుకు పనులు ప్రారంభించింది. అటు ఆస్ట్రేలియాతో కలిసి లిథియం, కోబాల్ట్ ఆస్తులలో ఉమ్మడి పెట్టుబడులపై భారత్ దృష్టి పెట్టింది. అలాగే జర్మనీ, నార్వేలతో కలిసి ప్రాసెసింగ్, రీసైక్లింగ్, సాంకేతిక రంగాలలో పరస్పర సహకారాన్ని భారత్ మరింత ముందుకు తీసుకెళుతోంది.