జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ చెక్‌పోస్టుపై జరిగిన ఉగ్రదాడిని ఓ జవాన్‌ సమయస్ఫూర్తితో తిప్పికొట్టారు. దాడిలో గాయపడినప్పటికీ వెనక్కి తగ్గకుండా ఎదురుకాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది గాయపడ్డారు. సీసీటీవీ ఫుటేజీలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతున్న దృశ్యాలు నమోదయ్యాయి.

కుల్గాం ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. కనీసం ఇద్దరు ఉగ్రవాదులు గేబియన్‌ నిర్మాణం వెనుక మాటువేసి సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై కాల్పులు జరిపారు. అయితే ఓ జవాన్‌ గాయపడినప్పటికీ వెంటనే ఎదురు కాల్పులు జరపడంతో వారి ప్రయత్నం విఫలమైంది. బలగాలు ప్రతిస్పందనను మరింత తీవ్రతరం చేసేలోపే ఉగ్రవాదులు వెనక్కి తగ్గి పారిపోయారు.

దాడి జరిగిన ప్రదేశానికి 100 మీటర్ల లోపే సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ఉంది. ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో వచ్చి భద్రతా సిబ్బందికి భారీగా ప్రాణనష్టం కలిగించాలనే లక్ష్యంతో దాడికి దిగినట్లు అధికారుల విశ్లేషణలో వెల్లడైంది. భద్రతా బలగాల అప్రమత్తత, సన్నద్ధత వల్లే వారి వ్యూహం బెడిసికొట్టిందని ఓ అధికారి పేర్కొన్నారు.

లోయలో కొంతకాలంగా ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కుల్గాం దాడి ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర ఘటనగా దీన్ని పరిగణిస్తున్నారు. ఆ దాడి భారత్‌-పాక్‌ మధ్య నాలుగు రోజుల ఘర్షణకు దారితీసింది.

స్థానిక యువత ఉగ్రవాదంలో చేరడం దాదాపు నిలిచిపోవడం కశ్మీర్‌ భద్రతా పరిస్థితుల్లో మార్పునకు కారణమైందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. గత వారం కశ్మీర్‌ జోన్‌ ఐజీపీ మీడియాతో మాట్లాడుతూ.. లోయలో ప్రస్తుతం లతీఫ్‌ అహ్మద్‌ భట్‌ అనే ఒక్క స్థానిక ఉగ్రవాది మాత్రమే క్రియాశీలంగా ఉన్నట్లు వెల్లడించారు. తాజా దాడిలో అతడి ప్రమేయం ఉందా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఆగస్టు 1న ఇదే ప్రాంతంలో వలస కార్మికులపై జరిగిన దాడిలోనూ అతడి పేరు తెరపైకి వచ్చింది.