ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాసేపటి క్రితం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని దక్షిణ గోపురం సమీపంలో ఉన్న అన్నప్రసాద పోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్వామివారికి లడ్డు, వడ, అన్నప్రసాదాలు తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో... పోటు నుంచి భారీగా అగ్నికీలలు, దట్టమైన పొగ ఎగసిపడ్డాయి.

నెయ్యి ఒలికిపడటం వల్ల మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఒక్కసారికగా మంటలు చెలరేగడంతో పోటులో ప్రసాదాలు తయారు చేస్తున్న సిబ్బందితో పాటు పరిసరాల్లో ఉన్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే ఆలయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాదం మరింత విస్తరించకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా సమీపంలోని మండపాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో ఆలయ వర్గాలు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం కారణంగా ప్రసాదాల తయారీని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.