ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం ఇకపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) భాగస్వామ్య సదస్సులకు శాశ్వత వేదికగా మారనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయెల్ కీలక ప్రకటన చేశారు. విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. అభివృద్ధి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుల పనితీరును 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని నీరు, నిప్పుతో పోలుస్తూ, ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఏపీ ముందుకు
ఇటీవల రెండు తీవ్రమైన తుపాన్లు రాష్ట్రాన్ని దెబ్బతీసినా, విశాఖ నగరం వేగంగా కోలుకుని అంతర్జాతీయ సదస్సుకు వేదిక కావడం అభినందనీయమని గోయెల్ అన్నారు. "ప్రపంచమంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చర్చిస్తుంటే, సీఎం చంద్రబాబు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన కాలం కంటే ముందు ఆలోచించి ఏఐ, క్వాంటం టెక్నాలజీల ప్రాముఖ్యతను ఎప్పుడో గుర్తించారు" అని వివరించారు. 

2024లో చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అప్పుల్లో ఉండగా, వ్యవస్థలు చిన్నాభిన్నమై ఉన్నాయని, అయినా పట్టుదలతో రాష్ట్రాన్ని పునరుద్ధరించి పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచేందుకు పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాను ప్రారంభించడం గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు.

పెట్టుబడిదారులకు భారత్ భరోసా
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, సవాళ్లు నెలకొన్న ప్రస్తుత తరుణంలో పెట్టుబడిదారులకు భారత్ అత్యంత సురక్షితమైన, విశ్వసనీయమైన గమ్యస్థానంగా నిలుస్తోందని గోయెల్ భరోసా ఇచ్చారు. "అప్పటి కాకతీయ రాజు గణపతి దేవుడు విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించిన చారిత్రక నేపథ్యం మనది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ విదేశీ భాగస్వాములను గౌరవిస్తూనే ఉంది" అని గుర్తుచేశారు. భారత్ ఎన్నడూ టెక్నాలజీ బదిలీని కోరదని, ఇతర దేశాల మేధోసంపత్తిని దొంగిలించదని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కులను పూర్తిగా గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ నగరం 'స్టీల్ సిటీ' నుంచి 'సిలికాన్ సిటీ'గా రూపాంతరం చెందుతోందని, ఓర్వకల్లు, పూడిమడక వంటి ప్రాంతాలు గ్రీన్ ఎనర్జీ హబ్స్‌గా ఎదుగుతున్నాయని తెలిపారు. తయారీ, పర్యాటకం వంటి అనేక రంగాల్లో ఏపీలో, భారత్‌లో అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. "దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని, అలాంటి తీయనైన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం సంతోషాన్నిస్తుంది" అని కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు.