రోజంతా బయట గడిపి ఇంటికి రాగానే చాలామంది బ్యాగు పక్కన పెట్టి, దుస్తులు మార్చుకుని విశ్రాంతి తీసుకుంటారు. అయితే బయటకు వెళ్లినప్పుడు మనతోపాటు వచ్చే కొన్ని వస్తువులపై దుమ్ము, ధూళి, చెమటతో పాటు సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉంటుంది. వాటిని అలాగే ఇంట్లో ఉంచితే ఇతర వస్తువులు, ఉపరితలాలకూ మురికి వ్యాపించవచ్చు. అందుకే ఇంటికి రాగానే కొన్ని వస్తువులను శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

1. చేతులు
బయట ఉన్నప్పుడు లిఫ్ట్‌ బటన్లు, తలుపుల హ్యాండిళ్లు, ప్రజా రవాణా వాహనాల్లోని పట్టీలు, షాపింగ్‌ బ్యాగులు ఇలా ఎన్నో వస్తువులను చేతులతో తాకుతాం. వాటి ద్వారా చేతులకు మురికి, సూక్ష్మజీవులు చేరవచ్చు. ఇంటికి రాగానే సబ్బు, నీటితో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా తినే ముందు, వంట చేసే ముందు, ముఖాన్ని తాకే ముందు ఈ జాగ్రత్త తప్పనిసరి.

2. మళ్లీ ఉపయోగించే వాటర్‌ బాటిళ్లు
ఆఫీసు, జిమ్‌, రెస్టారెంట్‌ ఇలా ఎక్కడికి వెళ్లినా వాటర్‌ బాటిళ్లను వెంట తీసుకెళుతుంటాం. వాటి మూతలు, నీళ్లు తాగే భాగంపై లాలాజలం, దుమ్ము, సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉంది. అందుకే బాటిళ్లను క్రమం తప్పకుండా కడగాలి. ముఖ్యంగా మూత, స్ట్రా, లోపలి ఇరుకైన భాగాలను శుభ్రం చేయాలి. తేమ మిగలకుండా ఆరబెట్టాలి.

3. లంచ్‌ బాక్సులు
ఆఫీసు, కళాశాలలకు భోజనం తీసుకెళ్లే డబ్బాలను ఇంటికి రాగానే శుభ్రం చేయాలి. ఆహార పదార్థాల అవశేషాలు డబ్బా మూలల్లో, మూతల దగ్గర, రబ్బరు పట్టీల మధ్య ఉండిపోవచ్చు. ఇవి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి. డిష్‌ వాష్‌ లిక్విడ్‌తో కడిగి, పూర్తిగా ఆరిన తర్వాతే భద్రపరచాలి.

4. రద్దీ ప్రాంతాల్లో ధరించిన దుస్తులు
బస్సులు, రైళ్లు, కార్యాలయాలు, వ్యాయామశాలల వంటి రద్దీ ప్రదేశాల్లో గడిపినప్పుడు దుస్తులకు చెమట, దుమ్ము, ధూళి అంటుకోవచ్చు. ఇంటికి రాగానే వాటిని మార్చుకోవాలి. చెమట పట్టిన లేదా మరీ మురికిగా ఉన్న దుస్తులను ఉతికేందుకు వేయాలి.

5. మళ్లీ ఉపయోగించే షాపింగ్‌ బ్యాగులు
కూరగాయలు, నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే బ్యాగులను చాలామంది శుభ్రం చేయడం మరిచిపోతుంటారు. వీటిని సూపర్‌ మార్కెట్‌ కౌంటర్లు, వాహనాల సీట్లు, నేలపై ఉంచుతుంటాం. దీంతో వాటికి మురికి అంటుకోవచ్చు. వస్త్రంతో చేసిన బ్యాగులను వాటిపై ఉన్న సూచనల ప్రకారం ఉతకాలి. ప్లాస్టిక్‌ బ్యాగులను తగిన శుభ్రపరిచే ద్రావణంతో తుడిచి, పూర్తిగా ఆరిన తర్వాతే భద్రపరచాలి.

ఇంటిని శుభ్రంగా ఉంచడం అంటే నేలను తుడవడం, ఫర్నిచర్‌పై దుమ్ము దులపడం మాత్రమే కాదు. బయటకు వెళ్లి ఇంటికి తీసుకొచ్చే వస్తువులపైనా శ్రద్ధ పెట్టాలి. ఈ చిన్న అలవాట్లు ఇంట్లోకి మురికి వ్యాపించకుండా నియంత్రించడంలో తోడ్పడతాయి.