ఉద్యోగం కోసం మహానగరాలకు వెళ్లాలా? సొంతూరిలోనే ఉంటూ తక్కువ జీతంతో పనిచేయాలా? కెరీర్‌ ప్రారంభంలో చాలామంది యువతను వేధించే ప్రశ్న ఇది. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఎక్కువ జీతం, మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయనే ఆకర్షణతో చాలామంది పట్టణాలు విడిచి వెళ్తున్నారు. అయితే అక్కడ వచ్చే అదనపు ఆదాయంలో అద్దె, రవాణా, ఆహారం, ఇతర ఖర్చులకే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. దీంతో పెద్ద నగరాల్లో ఉద్యోగం చేస్తేనే ఆర్థికంగా ఎదుగుతామన్న అంచనాలు మారుతున్నాయి.

ఉదాహరణకు.. ఓ యువకుడికి మహానగరంలో ఏడాదికి రూ.5 లక్షల జీతంతో ఉద్యోగం వచ్చిందనుకుందాం. నెలకు స్థూల వేతనం సుమారు రూ.41,600. అదే వ్యక్తికి సొంతూరిలో ఏడాదికి రూ.3 లక్షల జీతంతో ఉద్యోగం లభిస్తే నెలకు రూ.25 వేలు వస్తాయి. రెండు ఉద్యోగాల మధ్య నెలకు రూ.16,600 తేడా ఉంటుంది. చూడ్డానికి మహానగర ఉద్యోగమే లాభదాయకంగా కనిపిస్తుంది. కానీ ఖర్చుల లెక్కలు వేసుకుంటే పరిస్థితి మారుతుంది.

సొంతూరిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటే ఇంటి అద్దె భారం ఉండకపోవచ్చు. మహానగరంలో మాత్రం పీజీ లేదా షేరింగ్‌ గదికి కూడా వేల రూపాయలు చెల్లించాలి. రెంట్ఓక్‌ 2023 గణాంకాల ప్రకారం.. ముంబయిలో ముగ్గురు కలిసి ఉండే పీజీ గది అద్దె సగటున నెలకు రూ.12 వేలుగా ఉంది. ఢిల్లీలోనూ ఇదే స్థాయిలో అద్దెలున్నాయి. దీనికి ప్రయాణం, బయట భోజనం, విద్యుత్‌, ఇంటర్నెట్‌ ఖర్చులు అదనం. ఉద్యోగం కోసం నగరం మారినప్పుడు అయ్యే ప్రారంభ ఖర్చులూ ఉంటాయి. దీంతో అధిక జీతం వల్ల వచ్చే ప్రయోజనం గణనీయంగా తగ్గుతుంది.

ఇక సొంతంగా ఇల్లు తీసుకోవాలనుకునే యువ ఉద్యోగులు, దంపతులకు అద్దె భారం మరింత పెరుగుతోంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో 2024లో వెయ్యి చదరపు అడుగుల 2బీహెచ్‌కే ఇంటి అద్దె నెలకు సుమారు రూ.35 వేలుగా ఉంది. లక్నోలోని ఇందిరానగర్‌లో ఇలాంటి ఇళ్ల అద్దె రూ.14 వేల నుంచి రూ.15 వేల మధ్య ఉంది. అంటే నెలకు దాదాపు రూ.20 వేల వ్యత్యాసం. ఏడాదికి చూస్తే బెంగళూరులో నివసించే వారు ఇంటి అద్దె కోసమే అదనంగా సుమారు రూ.2.4 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021 చివరి నుంచి 2024 తొలి ఆరు నెలల మధ్య కొన్ని ప్రాంతాల్లో అద్దెలు 72 శాతం వరకు పెరిగాయి.

నగర జీవన వ్యయం పెరగడం యువ దంపతుల కుటుంబ ప్రణాళికలపైనా ప్రభావం చూపుతోంది. చదువు, ఉద్యోగం, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, వ్యక్తిగత నిర్ణయాలతోపాటు పిల్లల పెంపకం ఖర్చులూ కుటుంబ నిర్ణయాల్లో కీలకంగా మారుతున్నాయి. పుట్టినప్పటి నుంచి కళాశాల చదువు పూర్తయ్యే వరకు ఒక బిడ్డ పెంపకానికి రూ.38 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనాలున్నాయి. ఇద్దరూ సంపాదిస్తున్నా భారీ అద్దెలు, ఇతర ఖర్చుల మధ్య పిల్లల పెంపకానికి అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవడం సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో డీఐఎన్‌కే (డబుల్‌ ఇన్‌కమ్‌ నో కిడ్స్‌) జీవన విధానంపై చర్చ పెరుగుతోంది. అయితే పిల్లలను కనాలా వద్దా అన్న నిర్ణయం ఆర్థిక పరిస్థితులపైనే కాకుండా వ్యక్తిగత అభిరుచులు, కెరీర్‌ లక్ష్యాలు, పిల్లల సంరక్షణ సౌకర్యాలపైనా ఆధారపడి ఉంటోంది.

ఉద్యోగంతోపాటు చిన్న వ్యాపారం చేయాలనుకునే వారికి మహానగరాల్లో మరో సమస్య ఎదురవుతోంది. పెద్ద మార్కెట్లు, ఈ-కామర్స్‌, క్విక్‌ కామర్స్‌ వేదికలు వ్యాపార విస్తరణకు అవకాశాలు కల్పిస్తున్నా.. సరుకులు నిల్వ చేసేందుకు తగిన స్థలం దొరకడం కష్టమవుతోంది. షేరింగ్‌ ఇంట్లో ఉండేవారికి సరుకులు, ప్యాకింగ్‌ సామగ్రి పెట్టుకునే అవకాశం పరిమితం. ప్రత్యేకంగా గోదాము లేదా వాణిజ్య స్థలం అద్దెకు తీసుకోవాలంటే భారీ ఖర్చు అవుతుంది.

ఈ పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులు తిరిగి సొంతూళ్లకు వెళ్లడంపై దృష్టి పెడుతున్నారు. జైపూర్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌, కొచ్చి వంటి ద్వితీయ శ్రేణి నగరాలు నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో సీనియర్‌ స్థాయి ఉద్యోగుల సగటు వేతనం రూ.28.38 లక్షలుగా ఉన్నట్లు కథనం పేర్కొంది. కొన్ని నగరాల్లో మొదటి శ్రేణి నగరాలతో సమానంగా జీతాలు లభిస్తున్నాయి. అహ్మదాబాద్‌లో వేతనాల పెరుగుదల 9.5 శాతంగా ఉండొచ్చని అంచనా. కుటుంబానికి దగ్గరగా ఉండటం, తక్కువ అద్దె, పొదుపు పెంచుకునే అవకాశం వంటివి సొంతూరికి తిరిగి వెళ్లేవారికి ప్రయోజనాలు.

అయితే మహానగరాల్లో బహుళజాతి సంస్థలు, ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు, వృత్తిపరమైన పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కెరీర్‌ ప్రారంభంలో అక్కడ లభించే అనుభవం భవిష్యత్తులో మెరుగైన వేతనాలకు దోహదపడవచ్చు. కాబట్టి ఉద్యోగం కోసం నగరం మారే ముందు కేవలం జీతాన్ని కాకుండా అక్కడి ఖర్చులు, భవిష్యత్తు అవకాశాలను కూడా బేరీజు వేసుకోవాలి.

హైబ్రిడ్‌ వర్క్‌ విధానం వల్ల కొందరు ఉద్యోగులు రెండు నగరాల్లో ఇళ్లు నిర్వహించాల్సి వస్తోంది. సొంతూరిలో కుటుంబంతో ఉంటూనే కార్యాలయం ఉన్న నగరంలో మరో ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. నెలలో కొద్ది రోజులే ఉపయోగించినా అద్దె మాత్రం పూర్తిగా చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి వారికి అవసరం లేని ఫర్నిచర్‌, వస్తువులను ప్రత్యేక నిల్వ కేంద్రాల్లో ఉంచుకోవడం ప్రత్యామ్నాయంగా మారుతోందని స్టోర్‌మైగూడ్స్‌ వ్యవస్థాపకుడు సుదీప్‌ గుప్తా ఎన్డీటీవీకి తెలిపారు.