సౌత్ ఇండియాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెలబ్రిటీ వివాహాల్లో ఒకటైన సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌ల పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వారి వివాహ రిసెప్షన్ కోసం తయారుచేసిన ప్రత్యేకమైన ఆహ్వాన పత్రిక వివరాలను దానిని డిజైన్ చేసిన రంజినీ అయ్యంగార్ తాజాగా పంచుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా, ఎంతో క్లాస్‌గా, చూసినవారు జీవితాంతం దాచుకునేలా ఈ ఇన్విటేషన్‌ను రూపొందించినట్టు ఆమె తెలిపారు.

జ్ఞాపికగా నిలిచిపోయేలా డిజైన్
ఈ ఆహ్వాన పత్రిక డిజైనింగ్ వెనుక ఉన్న ఆలోచనలను రంజినీ అయ్యంగార్ వివరిస్తూ.. "అనిరుధ్, కావ్యలకు చాలా స్పష్టమైన ఆలోచన ఉంది. ఆహ్వాన పత్రిక అందరి దృష్టిని ఆకర్షించాలి, కానీ అదే సమయంలో అతిగా, ఆర్భాటంగా ఉండకూడదని వారు కోరుకున్నారు. అందుకే మేము నీలం, తెలుపు రంగుల థీమ్‌ను ఎంచుకున్నాం. కేవలం ఓ కాగితంలా కాకుండా, అతిథులు ఒక మధుర జ్ఞాపికగా దాచుకునేలా చెక్కతో చేసిన ప్రత్యేకమైన పెట్టె (వుడెన్ బాక్స్)లో త్రీడీ ఎలిమెంట్స్‌తో దీనిని రూపొందించాం" అని అన్నారు. ఈ పెట్టెపై చేతితో గీసిన అందమైన చిత్రాలు కూడా ఉన్నాయని సమాచారం. వచ్చిన ఎన్నో ఖరీదైన శుభలేఖల మధ్య ఇది ప్రత్యేకంగా నిలవాలన్నదే తమ ఉద్దేశమని ఆమె వివరించారు.

గ్రీస్‌లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్
రిపోర్టుల ప్రకారం.. ఈ జంట నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకోనున్నారు. వారి డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రీస్‌లో జరగనున్న నేపథ్యంలోనే ఆ దేశ జాతీయ జెండా రంగులకు ప్రతీకగా నీలం, తెలుపు థీమ్‌ను ఆహ్వాన పత్రిక కోసం ఎంచుకున్నారని తెలుస్తోంది. 

పెళ్లి తర్వాత నవంబర్ 21న చెన్నైలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖుల కోసం అంగరంగ వైభవంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆహ్వాన పత్రిక రూపకల్పన సమయంలో అనిరుధ్, కావ్య ఇద్దరూ డిజైనింగ్ బృందంతో నిరంతరం టచ్‌లో ఉంటూ, తమకు కావాల్సిన మార్పుల గురించి స్పష్టమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని రంజినీ అయ్యంగార్ పేర్కొన్నారు.

ప్రస్తుతం సౌత్ ఇండియాలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ కొనసాగుతుండగా, కావ్య మారన్ సన్ టీవీ నెట్‌వర్క్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్‌గా అందరికీ సుపరిచితురాలు.