ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. చల్లని ఉదయాలు, పొడి వాతావరణం మన దినచర్యపై ప్రభావం చూపుతున్నాయి. చలిగా ఉందని వ్యాయామం మానేయడం, నీళ్లు తాగడం తగ్గించడం, చర్మ సంరక్షణను పట్టించుకోకపోవడం వంటివి ఈ కాలంలో ఎదురయ్యే సాధారణ సమస్యలు. వాతావరణానికి అనుగుణంగా కొన్ని అలవాట్లను మార్చుకుంటే ఆరోగ్యంగా, హాయిగా ఉండొచ్చు. చలికాలం మొదలవుతున్న వేళ పాటించాల్సిన ఏడు సూచనలు ఇవే.

1. తగినన్ని నీళ్లు తాగండి
చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది. దీంతో చాలామంది నీళ్లు తాగడం తగ్గిస్తారు. కానీ శరీరానికి అవసరమైన ద్రవాలు అందడం ముఖ్యం. రోజంతా తగినంత నీరు తాగాలి. గోరువెచ్చని నీరు, చక్కెర కలపని హెర్బల్‌ టీ, సూప్‌లు కూడా శరీరానికి ద్రవాలను అందిస్తాయి.

2. వ్యాయామ సమయాన్ని మార్చుకోండి
చల్లని ఉదయాల్లో వ్యాయామం చేయడం కష్టంగా అనిపించవచ్చు. అంతమాత్రాన శారీరక శ్రమను పూర్తిగా మానేయకూడదు. ఉదయం బదులు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎక్సర్‌సైజ్‌ చేయొచ్చు. ఇంట్లోనే యోగా, బలాన్ని పెంచే వ్యాయామాలు, డ్యాన్స్‌ చేయవచ్చు. బయట వ్యాయామం చేసేవారు వెచ్చటి దుస్తులు ధరించి, ముందుగా వార్మప్‌ చేయాలి.

3. చర్మ సంరక్షణపై శ్రద్ధ పెట్టండి
చల్లని గాలి, పొడి వాతావరణం వల్ల చర్మం పొడిబారడం, దురద, పెదాలు పగలడం వంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన క్లెన్సర్‌ ఉపయోగించాలి. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. పెదాలకు లిప్‌ బామ్‌ ఉపయోగించాలి. మరీ వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం తగ్గించాలి. పగటిపూట సన్‌స్క్రీన్‌ వాడటం కొనసాగించాలి.

4. కాలానుగుణ ఆహారాన్ని తీసుకోండి
చలికాలంలో లభించే క్యారెట్‌, పాలకూర, పచ్చిబఠానీ, కాలీఫ్లవర్‌ వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో సూప్‌లు, పప్పు వంటకాలు చేసుకోవచ్చు. గుడ్లు, చేపలు, చికెన్‌, బీన్స్‌, పప్పుధాన్యాల వంటి ప్రొటీన్లు అందించే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. దీంతో భోజనం సమతులంగా ఉంటుంది.

5. నిద్ర వేళలను క్రమబద్ధంగా ఉంచుకోండి
చలికాలంలో ఉదయాన్నే నిద్ర లేవడం కష్టంగా అనిపించవచ్చు. అయినా ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. పగటిపూట కొంతసేపు సహజమైన వెలుతురులో గడపడం కూడా నిద్ర-మేల్కొనే సమయాల క్రమాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది.

6. పొరలుగా దుస్తులు ధరించండి
ఉదయం, మధ్యాహ్నం ఉష్ణోగ్రతల్లో తేడా ఉండొచ్చు. అందుకే ఒకే మందపాటి దుస్తులకు బదులుగా అవసరాన్ని బట్టి తీసేయడానికి, వేసుకోవడానికి వీలుగా పొరలుగా దుస్తులు ధరించాలి. ఉదయాన్నే ప్రయాణించే వారు, రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకునేవారు స్వెటర్‌ లేదా జాకెట్‌ వెంట ఉంచుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులు చలి నుంచి అదనపు రక్షణ పొందేలా చూసుకోవాలి.

7. గాలి నాణ్యతను పరిశీలించండి
చలికాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ సహా కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత దిగజారవచ్చు. అందుకే బయట నడకకు లేదా పరుగు కోసం వెళ్లే ముందు స్థానిక ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ)ను పరిశీలించాలి. కాలుష్య స్థాయులు ఎక్కువగా ఉంటే ఇంట్లోనే వ్యాయామం చేయడం మంచిది. ముఖ్యంగా శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.