అమెరికా టెక్‌ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌పై గూఢచర్యం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆయనను లక్ష్యంగా చేసుకుని విదేశీ నిఘా ప్రయత్నాలు జరిగాయన్న వార్తలపై ఎన్విడియా దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో చైనా ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఆ దేశం తీవ్రంగా ఖండించింది. అదంతా నిరాధార ప్రచారమని స్పష్టం చేసింది.

గూఢచర్యం ఆరోపణలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్‌ స్పందించారు. ఆలిస్ చైనా గూఢచారి అంటూ వస్తున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తమ దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేస్తున్న తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు.

ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ విదేశీ నిఘా ప్రయత్నాలకు లక్ష్యంగా మారారన్న వార్తల నేపథ్యంలో సంస్థ బోర్డు విచారణ చేపట్టింది. గతేడాది అమెరికా జరిపిన దర్యాప్తులో ఆలిస్‌ హువాంగ్‌ అనే చైనా వ్యాపారవేత్త పేరు తెరపైకి వచ్చింది. ఆమె జెన్సన్‌ హువాంగ్‌పై నిఘా పెట్టేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఆమె మెగాస్పీడ్‌ ఇంటర్నేషనల్‌లో కీలక బాధ్యతల్లో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ వ్యవహారంలో సింగపూర్‌కు చెందిన ఏఐ డేటా సెంటర్‌ సంస్థ మెగాస్పీడ్‌పైనా ఆరోపణలు వచ్చాయి. ఎన్విడియా చిప్‌లను తాము అక్రమంగా చైనాకు తరలించినట్టు జరిగిన ప్రచారాన్ని ఆ సంస్థ ఖండించింది. అమెరికా, మలేషియా అధికారులు, ఎన్విడియా నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి అక్రమాలకు ఆధారాలు లభించలేదని తెలిపింది.

బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో తమ కార్యకలాపాలపై తప్పుదారి పట్టించే సమాచారం ఉందని మెగాస్పీడ్‌ పేర్కొంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఎన్విడియా కంప్యూటింగ్‌ పవర్‌ క్లౌడ్‌ వ్యాపారానికి తాము కీలక భాగస్వామినని వెల్లడించింది. సింగపూర్‌, మలేషియా, ఇండోనేషియాల్లో కార్యాలయాలు ఉన్నాయని తెలిపింది.