ఇంట్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచుతున్నా.. దోమల నివారణకు రకరకాల మందులు వాడుతున్నా వాటి బెడద తగ్గడం లేదా? అయితే సమస్య ఇంటి బయట కాకుండా లోపలే ఉండొచ్చు. మనం పెద్దగా పట్టించుకోని కొన్ని వస్తువులు దోమల పెరుగుదలకు, అవి ఇంట్లోనే తిష్ఠ వేయడానికి కారణమవుతున్నాయి. పూల కుండీల దగ్గర నుంచి పాత టైర్ల వరకు కొన్ని వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

పూల కుండీల కింద నీటి ట్రేలు
ఇంట్లో మొక్కల పెంపకం కోసం పూల కుండీల కింద నీరు నిలిచేలా ట్రేలు పెడుతుంటారు. వాటిలో మిగిలిపోయిన నీరు దోమలు గుడ్లు పెట్టేందుకు అనువైన ప్రదేశంగా మారుతుంది. అందుకే కుండీల కింద నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. మొక్కలకు అవసరమైనంత మాత్రమే నీరు పోయాలి.

మూతలేని నీటి పాత్రలు
బాత్‌రూమ్‌లో మూత పెట్టకుండా ఉంచిన బకెట్లు, వినియోగించని నీటి ట్యాంకులు, ఇతర నిల్వ పాత్రల్లో నీరు రోజుల తరబడి ఉంటే దోమలు పెరిగే అవకాశం ఉంది. నీటి నిల్వ పాత్రలకు తప్పనిసరిగా మూతలు పెట్టాలి. వాటిని తరచూ శుభ్రం చేయాలి.

పూడుకుపోయిన డ్రైనేజీలు
బాత్‌రూమ్‌, వంటగది, బాల్కనీల్లోని డ్రైనేజీలు పూడుకుపోతే నీరు నిలిచిపోతుంది. వాటిలో పేరుకుపోయే వ్యర్థాలు కూడా కొన్ని రకాల దోమలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయి. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఫ్లోర్‌ ట్రాప్‌లలో నీరు నిలవకుండా చూసుకోవాలి.

పాత టైర్లు, సీసాలు, పనికిరాని పాత్రలు
బాల్కనీలో నిరుపయోగంగా పడేసిన బకెట్లు, పార్కింగ్‌ ప్రదేశాల్లో ఉన్న పాత టైర్లు, ఖాళీ ప్లాస్టిక్‌ సీసాల్లో వర్షపు నీరు చేరుతుంది. ఇలా నిలిచిన నీటిలో దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే పనికిరాని వస్తువులను తొలగించాలి. అవసరమైన పాత్రలను బోర్లించి ఉంచాలి.

తేమగా ఉండే చీకటి మూలలు
దోమలు పెరగడానికి నిల్వ నీరే కారణం కాదు. ఇంట్లో చల్లగా, తేమగా, వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో పెద్ద దోమలు విశ్రాంతి తీసుకుంటాయి. కర్టెన్ల వెనుక, ఫర్నిచర్‌ కింద, సామాన్లు ఎక్కువగా పేరుకుపోయిన గదుల్లో ఇవి దాక్కుంటాయి. అలాంటి ప్రదేశాలను శుభ్రంగా, పొడిగా ఉంచాలి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి.

దోమల నివారణకు కేవలం రిపెల్లెంట్లు వాడితే సరిపోదు. ఇంట్లో ఎక్కడైనా నీరు నిలిచిందా? తేమగా ఉండే మూలలు ఉన్నాయా? అని తరచూ పరిశీలించాలి. చిన్నపాటి శుభ్రత చర్యలతో దోమలు పెరిగే అవకాశాలను తగ్గించుకోవచ్చు.