భారత్‌లో గత దశాబ్ద కాలంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్‌ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని ఓ నివేదిక వెల్లడించింది. 2011లో దేశంలో అత్యంత పేదరికంలో ఉన్నవారి సంఖ్య 27.1 శాతంగా ఉండగా.. 2023 నాటికి అది 2.6 శాతానికి తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి.

‘ది బిజినెస్‌ స్టాండర్డ్‌’ ప్రచురించిన నివేదిక ప్రకారం.. భారత్‌ దాదాపు 49.6 కోట్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటపడేసింది. అమెరికా, రష్యా దేశాల మొత్తం జనాభా కంటే ఇది ఎక్కువ. ప్రపంచంలో పేదరికం అత్యంత వేగంగా తగ్గిన దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందని నివేదిక పేర్కొంది.

రోజుకు 4.2 డాలర్ల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకునే దిగువ మధ్య ఆదాయ దేశాల పేదరిక ప్రమాణం ప్రకారం కూడా భారత్‌లో పేదరికం 2011లో 57.7 శాతం ఉండగా.. 2023 నాటికి 16.1 శాతానికి తగ్గింది. అయితే పేదరికాన్ని కొలిచే విధానాల్లో వచ్చిన మార్పులు కూడా ఈ గణాంకాలపై కొంత ప్రభావం చూపి ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా పేదరికం తగ్గుదల ఒకేలా లేదని నివేదిక తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ వరకు ఉన్న ప్రాంతంలోనే దేశంలోని పేదల్లో 57 శాతం మంది నివసిస్తున్నట్లు వెల్లడించింది.

పేదరికం తగ్గడానికి ప్రధానంగా ఆర్థిక వృద్ధి, వినియోగం పెరగడం, ఉపాధి అవకాశాలు విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలు దోహదపడ్డాయని నివేదిక వివరించింది. 2022-25 మధ్య భారత్‌ సగటున ఏటా 7 శాతానికి పైగా ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2015లో 1.24 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న కుటుంబాల ఖర్చు 2025 నాటికి 2.24 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.

మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడం కూడా పేదరికం తగ్గుదలకు తోడ్పడింది. 2014-24 మధ్య దేశంలో 17 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు నివేదిక పేర్కొంది. సగటున ఏటా 1.7 కోట్ల ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగిత రేటు 2015లో 7.6 శాతంగా ఉండగా.. 2025 నాటికి 4.2 శాతానికి తగ్గింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో డిజిటల్‌ విధానాల విస్తరణ, మహిళా కేంద్రిత పథకాలు, వ్యవసాయం, గ్రామీణ రంగాలకు మద్దతు, సామాజిక భద్రతా కార్యక్రమాల విస్తరణ కూడా పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషించాయని నివేదిక వివరించింది.