ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే ఎల్‌నినో, లానినా పరిణామాలను ఏడాది ముందుగానే అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని గుర్తించారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ముందుగా ఉన్న పరిస్థితులను విశ్లేషించడం ద్వారా 12 నెలల ముందే వాతావరణ మార్పులను అంచనా వేయవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే కరవులు, వరదలు, తీవ్ర ఉష్ణోగ్రతలపై ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఎక్కువ సమయం లభించనుంది. 

ఎల్‌నినో-సదరన్‌ ఆసిలేషన్‌ (ఈఎన్‌ఎస్‌ఓ) అనేది పసిఫిక్‌ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడే మార్పులకు సంబంధించిన సహజ ప్రక్రియ. ఇందులో ఎల్‌నినో, లానినా, తటస్థ పరిస్థితులు అనే మూడు దశలుంటాయి. వీటి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, కరవులు, వరదలు, వడగాలులు, తుపానులపై ఉంటుంది. సాధారణంగా ఈ పరిణామాలు డిసెంబరు సమయంలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. ఇప్పటివరకు వీటిని సుమారు ఆరు నెలల ముందుగా అంచనా వేయగలుగుతున్నారు. ఏడాది ముందే కచ్చితంగా చెప్పడం మాత్రం సవాలుగా ఉంది. 

ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఐఆర్ఓ, మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తొమ్మిది దేశాల వాతావరణ నమూనాల ద్వారా రూపొందించిన 7,500కు పైగా పాత అంచనాలను విశ్లేషించారు. ఈ పరిశోధనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అంచనా ప్రారంభించే సమయంలో పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా పరిస్థితులు ఉంటే, ఏడాది తర్వాతి వాతావరణ పరిస్థితులను కూడా నమూనాలు మెరుగ్గా అంచనా వేస్తున్నాయి. అదే తటస్థ పరిస్థితుల నుంచి అంచనా మొదలుపెడితే ఫలితాలు అంత విశ్వసనీయంగా ఉండటం లేదని గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

లానినా పరిస్థితులు ఉన్నప్పుడు దీర్ఘకాలిక అంచనాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని పరిశోధకురాలు డాక్టర్‌ మాండీ ఫ్రాయండ్‌ తెలిపారు. తటస్థ పరిస్థితుల్లో సంప్రదాయ భౌతిక శాస్త్ర ఆధారిత నమూనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అలాంటి సందర్భాల్లో మెషీన్‌ లెర్నింగ్‌, గణాంక పద్ధతులు ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

అయితే ఈ విధానాన్ని వాతావరణ అంచనా వ్యవస్థల్లో వెంటనే అమలు చేయలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మరిన్ని పరీక్షలు అవసరమని తెలిపారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులు పంటల ప్రణాళిక, నీటి నిర్వహణ, సాగునీటి వినియోగంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది.