ప్రముఖ చిప్‌మేకర్ ఎన్విడియా కో-ఫౌండర్, సీఈవో జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధం వ్యవహారం అంతర్జాతీయ టెక్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన విదేశీ గూఢచర్య ఉచ్చులో పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించింది.

చైనా నిఘా వర్గాలతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలీస్ హువాంగ్ అనే మహిళతో తనకు సంబంధం ఉన్నట్లు వార్తలు రావడంతో జెన్సన్ హువాంగ్ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. తాను భార్యకు ద్రోహం చేశానని, తన ప్రవర్తన కుటుంబానికి బాధ కలిగించిందని పేర్కొంటూ క్షమాపణలు తెలిపారు. ఈ వ్యవహారం వల్ల అమెరికా జాతీయ భద్రతకు గానీ, ఎన్విడియా గోప్యతా అంశాలకు గానీ ఎలాంటి విఘాతం కలగలేదని బోర్డు ప్రాథమికంగా భావిస్తోంది. అయినప్పటికీ, వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు స్వతంత్ర న్యాయ నిపుణుల సాయంతో ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ జరుపుతామని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి హువాంగ్ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని బోర్డు పేర్కొంది.

ఈ వివాదం తెరపైకి రావడంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గతంలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. సిలికాన్ వ్యాలీ సమాచారాన్ని రాబట్టేందుకు కొందరు గూఢచారులు ట్రాప్‌లు వేస్తున్నారన్న వార్తలపై 2025 అక్టోబర్‌లో మస్క్ స్పందిస్తూ.. "ఎవరైనా మహిళ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తే, నువ్వు గూఢచర్యానికి ఒక సాధనంగా మారావని అర్థం" అంటూ చమత్కరించారు. ఆ పాత పోస్ట్ ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరోవైపు, హువాంగ్ చేసిన పని వివాదాస్పదమైనప్పటికీ, అమెరికా కృత్రిమ మేధ (AI) ఆధిపత్యానికి ఆయన ఎంతో అవసరమని పేర్కొన్న ఒక పోస్ట్‌కు మస్క్ మద్దతు పలికారు.