ఒక ప్రమాదం కొన్నిసార్లు ఊహించని శాస్త్రీయ ఆవిష్కరణలకు దారితీస్తుంది. సరిగ్గా 34 ఏళ్ల క్రితం సముద్రంలో కలిసిపోయిన వేలాది రబ్బర్ బొమ్మలు, ఇప్పటికీ సముద్ర గర్భంలోని ప్రవాహాల గురించి కీలక సమాచారాన్ని అందిస్తూ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ సంఘటన సైన్స్‌కు అందిన ఒక అనూహ్య వరంగా నిలిచిపోయింది.

వివరాల్లోకి వెళితే.. 1992 జనవరిలో హాంకాంగ్ నుంచి వాషింగ్టన్‌లోని టాకోమాకు ఒక కార్గో షిప్ ప్రయాణిస్తోంది. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుపాను కారణంగా ఓడలోని 12 షిప్పింగ్ కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. వాటిలో ఒక కంటైనర్ పగిలి, అందులో ఉన్న 28,800 రబ్బర్ ఆటబొమ్మలు నీటిలో కలిసిపోయాయి. 

వీటిలో పసుపు రంగు బాతులు, ఎరుపు రంగు నీటి కుక్కలు, ఆకుపచ్చ కప్పలు, నీలం తాబేళ్లు ఉన్నాయి. 'ఫ్రెండ్లీ ఫ్లోటీస్'గా పిలిచే ఈ బొమ్మలకు రంధ్రాలు లేకపోవడంతో అవి తేలికగా నీటిపై తేలుతూ ప్రయాణాన్ని ప్రారంభించాయి.

అదే ఏడాది చివరిలో ఈ బొమ్మలు మొదటిసారిగా అలాస్కా తీరానికి కొట్టుకువచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన సముద్ర శాస్త్రవేత్తలు కర్టిస్ ఎబ్బెస్‌మేయర్, జేమ్స్ ఇంగ్రాహం దీనిని ఒక గొప్ప అవకాశంగా గుర్తించారు. సముద్ర ఉపరితల ప్రవాహాలను అధ్యయనం చేయడానికి ఇది సరైన సమయమని భావించారు. సముద్ర తీరాల్లో తిరిగే వారి సహాయంతో ఎక్కడెక్కడ ఈ బొమ్మలు దొరుకుతున్నాయో సమాచారం సేకరించడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఈ బొమ్మల ప్రయాణం అద్భుతంగా సాగింది. వేలాది కిలోమీటర్లు ప్రయాణించి కొన్ని హవాయికి, మరికొన్ని అమెరికా అట్లాంటిక్ తీరానికి చేరుకున్నాయి. ఆశ్చర్యకరంగా కొన్ని బొమ్మలు ఆర్కిటిక్ మంచులో ఏళ్లపాటు చిక్కుకుపోయి, ఆ తర్వాత మంచు కరిగాక బయటపడి యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్, కెనడా తీరాలకు చేరాయి. 

ఈ బొమ్మల ప్రయాణ మార్గాల ఆధారంగా సేకరించిన డేటా, సముద్రపు సుడిగుండాలు, సముద్రంలోని వ్యర్థాలు ఎలా ప్రయాణిస్తాయో అర్థం చేసుకునేందుకు రూపొందించిన మోడళ్లను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడింది.

ఈ సంఘటన జరిగి మూడు దశాబ్దాలకు పైగా గడిచిపోయినప్పటికీ, ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ బొమ్మలు ఎక్కడో ఒకచోట ఒడ్డుకు కొట్టుకువస్తూనే ఉన్నాయి. చాలా వరకు బొమ్మలు శిథిలమైపోయినా, ఈ ప్రమాదవశాత్తూ జరిగిన ప్రయోగం మాత్రం సముద్ర శాస్త్ర పరిశోధనలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.