ఆటోలో విదేశీ యాత్రికుడు.. గూగుల్ చేస్తే నార్వే మేయర్.. షాకైన స్థానికుడు!

ఆటోలో విదేశీ యాత్రికుడు.. గూగుల్ చేస్తే నార్వే మేయర్.. షాకైన స్థానికుడు!

Foreign tourist in auto rickshaw turns out to be Norway Mayor Jo Inge Hesjevik
  • ఆటోలో ప్రయాణిస్తున్న విదేశీయుడిని పలకరించిన గుజరాత్ వ్యక్తి
  • గూగుల్ చేయగా అతను నార్వేలోని ఒక నగరానికి మేయర్ అని తెలిసి ఆశ్చర్యం
  • మేయర్ నిరాడంబరత, ఆటో ప్రయాణంపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు
  •  ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట‌ వైరల్ 
సాధారణంగా ఒక నగరానికి మేయర్ అంటే ఎలా ఉంటారు? ఖరీదైన కార్లలో తిరుగుతూ, అధికారిక హంగులతో కనిపిస్తారు. కానీ, అందుకు భిన్నంగా నార్వే దేశానికి చెందిన ఒక మేయర్, మన దేశంలో సాధారణ యాత్రికుడిగా ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గుజరాత్‌లో జరిగిన ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుజరాత్‌కు చెందిన చింతన్ మటియా అనే వ్యక్తికి, ఆటో రిక్షాలో ప్రయాణిస్తున్న ఒక విదేశీ యాత్రికుడు తారసపడ్డాడు. అతనితో మాటలు కలిపిన చింతన్, అతని ప్రయాణం గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కుతూహలంతో ఆ విదేశీయుడి గురించి గూగుల్ సెర్చ్ చేయగా వచ్చిన ఫలితం చూసి చింతన్ అవాక్కయ్యారు. 

తాను మాట్లాడిన వ్యక్తి సాధారణ పర్యాటకుడు కాదు, నార్వేలోని పోర్సాంగర్ మున్సిపాలిటీకి మేయర్ అయిన జో ఇంగే హెస్‌జెవిక్ అని తెలిసి ఆశ్చర్యపోయారు. హెస్‌జెవిక్ 2023 నుంచి మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన నార్వే కన్జర్వేటివ్ పార్టీ (హోయర్)కి చెందినవారు.

ఈ అనూహ్య అనుభవాన్ని చింతన్ మటియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పంచుకున్నారు. పొద్దుతిరుగుడు పువ్వుల డిజైన్లతో అందంగా అలంకరించిన ఆటోలో మేయర్ హెస్‌జెవిక్, తన సహచరుడితో కలిసి ప్రయాణిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. మేయర్ ఎంతో నిరాడంబరంగా, స్నేహపూర్వకంగా మాట్లాడారని చింతన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

వివిధ దేశాలకు చెందిన 61 మంది బృందంగా ఏర్పడి, 37 ఆటో రిక్షాలలో భారతదేశాన్ని చుట్టేస్తున్నారని చింతన్ వివరించారు. ఈ యాత్రలో భాగంగా వారు అడవులు, పర్వతాలు, పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. 

ఒక దేశంలోని నగరానికి మేయర్ ఇలా ఆటోలో భారత్‌లో తిరగడంపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఆయన నిరాడంబరతను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Advertisement
Jo Inge Hesjevik
Norway Mayor
Porsanger Municipality
Gujarat Auto Rickshaw
Norway Mayor India Visit
Chintan Matiya

More Telugu News