ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కేవలం 52 బంతుల్లోనే రికార్డు స్థాయి డబుల్ సెంచరీ నమోదు చేసి భారత్‌కు ఏడు వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో అనేక వరల్డ్ రికార్డులు ఈ టీనేజర్ కు దాసోహం అయ్యాయి. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత వైభవ్ సూర్యవంశీ మాట్లాడాడు. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌లలో మంచి ఆరంభాలు లభించినప్పటికీ భారీ ఇన్నింగ్స్‌లుగా మలచలేకపోయానని గుర్తుచేశాడు. అందుకే యూఏఈతో మ్యాచ్‌లో మొదట కాస్త సమయం తీసుకుని నిలకడగా ఆడాలని భావించినట్లు చెప్పాడు. పిచ్ నుంచి బౌలర్లకు ఎలాంటి సహకారం అందడం లేదని గ్రహించిన తర్వాతే తన సహజసిద్ధమైన దూకుడును ప్రదర్శించానని స్పష్టం చేశాడు. 

“గత రెండు మ్యాచ్‌ల్లో క్రీజులో కుదురుకున్నా భారీ స్కోర్లు చేయలేకపోయాను. అందుకే ఈసారి మొదట్లో కాస్త సమయం తీసుకుని నిలకడగా ఆడాలని అనుకున్నాను. అయితే ఒకటి, రెండు బంతులు ఎదుర్కొన్న తర్వాత పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లభించడం లేదని అర్థమైంది. దీంతో నా బలాన్ని నమ్ముకుని సహజమైన దూకుడుతో షాట్లు ఆడాను”అని వైభవ్ వివరించాడు.

పరిస్థితులు తనకు పూర్తి అనుకూలంగా మారడంతోనే స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించానని పేర్కొన్నాడు. “మనసులో ఎలాంటి సంక్లిష్టమైన ఆలోచనలు పెట్టుకోలేదు. వికెట్ గనక బౌలర్లకు సహకరిస్తే ఆచితూచి ఎక్కువసేపు క్రీజులో ఉండాలని భావించాను. అయితే పిచ్ బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలంగా మారింది, బంతి చక్కగా బ్యాట్‌పైకి వచ్చింది. అందుకే నా సహజమైన ఆటతీరుకే ప్రాధాన్యం ఇచ్చాను” అని తెలిపాడు.

మ్యాచ్ ఎలాంటిదైనా జట్టును విజయపథంలో నడిపించి ఆధిపత్యం ప్రదర్శించడమే తన ప్రధాన లక్ష్యమని వైభవ్ స్పష్టం చేశాడు. చిన్ననాటి నుంచి బంతిని స్పష్టంగా గమనిస్తూ ఆడటం అలవాటు చేసుకున్నానని, తన కోచ్ హృషీ ఇచ్చిన సలహాలు బ్యాటింగ్‌లో ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పాడు. “అండర్-19 స్థాయి నుంచే బంతిని నిశితంగా గమనించాలని కోచ్ హృషీ పదేపదే చెప్పేవాడు. బంతి గమనాన్ని సరిగ్గా చూస్తూ ఆడితే బ్యాటింగ్ చాలా సులువవుతుందని సూచించేవాడు” అని గుర్తుచేసుకున్నాడు. తిరిగి ఫామ్‌లోకి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇదే జోరును తర్వాతి మ్యాచ్‌ల్లోనూ కొనసాగించి జట్టును విజేతగా నిలపడమే తన ధ్యేయమని తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తం 53 బంతుల్లోనే 28 సిక్సర్లు, 7 ఫోర్లతో 204 పరుగులు చేశాడు. ఈ క్రమంలో లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే సరికొత్త ప్రపంచ రికార్డులను తిరగరాశాడు. 28 బంతుల్లోనే శతకం బాది, గతంలో జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ పేరిట ఉన్న 29 బంతుల ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తుడిచిపెట్టేశాడు. ఆ తర్వాత కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును అందుకుని క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ద్విశతకాన్ని నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 249 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ 144 బంతుల్లో 130 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో అర్షద్ 43 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-ఎ జట్టు.. సూర్యవంశీ తుపాన్ ఇన్నింగ్స్‌కు తోడు రింకూ సింగ్‌తో కలిసి మూడో వికెట్‌కు నెలకొల్పిన 137 పరుగుల కీలక భాగస్వామ్యంతో కేవలం 14.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. దీంతో భారత్-ఎ సునాయాసంగా విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.