మార్కెట్లో బంగారం, వెండి ధరలు గత పదిహేను రోజులుగా తీవ్ర క్షీణతను నమోదు చేస్తున్నాయి. రికార్డు స్థాయి గరిష్ఠాల నుంచి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో నగల దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు శుభకార్యాలకు బహుమతులు ఇవ్వాలనుకునే వారికి ఈ పరిణామం ఊరటనిస్తోంది. అయితే అధిక ధరల వద్ద పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లతో పాటు, ఇటీవల ఖరీదైన ధరకు స్టాక్ కొనుగోలు చేసిన కొందరు కొత్త వ్యాపారుల్లో మాత్రం ఈ మార్పు ఆందోళన కలిగిస్తోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 12,780 రూపాయలకు దిగొచ్చింది. జనవరిలో ఇది దాదాపు 18,000 రూపాయలుగా, సెప్టెంబర్-అక్టోబర్ కాలంలో 15,000 నుంచి 16,000 రూపాయల మధ్య కొనసాగింది. అటు వెండి ధర కూడా గతంలో కిలోకు 3.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు పలకగా, ప్రస్తుతం 1.6 లక్షల రూపాయలకు పడిపోయింది. ఈ తగ్గుదల బంగారంలో దాదాపు 34 శాతం, వెండిలో దాదాపు 60 శాతంగా నమోదైందని బెంగళూరు జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది.

ధరలు దిగిరావడంతో నగల దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య 20 నుంచి 25 శాతం మేర పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై జ్యువెలర్స్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి శ్రీనివాస్ ఆర్. మాట్లాడుతూ.. "ప్రస్తుత పరిస్థితిని రెండు రకాలుగా విశ్లేషించవచ్చు. వివాహాల కోసం, బహుమతుల కోసం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. కానీ మంచి రాబడులు ఆశించి గతంలో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు మాత్రం ఇది ఏమాత్రం అనుకూలమైన సమయం కాదు. వారు మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే. నా అంచనా ప్రకారం బంగారం ధర గ్రాముకు 11,500 రూపాయల వరకు మరింత తగ్గే అవకాశం ఉంది" అని పేర్కొన్నారు.

ధరల పతనం పరిశ్రమపై చూపుతున్న ప్రభావంపై వ్యాపారుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రలో తొలిసారిగా పది నెలల స్వల్ప వ్యవధిలోనే బంగారం గ్రాముకు 18,000 రూపాయల స్థాయి నుంచి దాదాపు 12,000 రూపాయలకు పడిపోయిందని శ్రీ సాయి గోల్డ్ ప్యాలెస్ అధినేత టి.ఎ. శరవణ తెలిపారు. అధిక ధరలు ఉన్న సమయంలో అప్పులు చేసి సరుకు నిల్వ చేసుకున్న కొత్త వ్యాపారులు.. ఉద్యోగుల జీతాలు, విద్యుత్ ఛార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి దాదాపు 25 శాతం వరకు నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పాత, స్థిరపడిన సంస్థలు ఇలాంటి ఒడిదుడుకులను తట్టుకోగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే కర్ణాటక స్టేట్ జ్యువెలర్స్ ఫెడరేషన్‌కు చెందిన బి. రామచారి ఈ నష్టాల వాదనను పూర్తిగా సమర్థించలేదు. చాలామంది వ్యాపారులు జనవరి-ఫిబ్రవరిలో తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆ తర్వాత అధిక ధరల వద్ద విక్రయించి లాభాలు పొందారని, ఆ లాభాలు ప్రస్తుత దిద్దుబాటును భర్తీ చేస్తాయని ఆయన వివరించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ 9న కీలక వడ్డీ రేట్ల సమీక్ష నిర్వహించనుందని, ఆ తర్వాతే మార్కెట్‌పై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, ప్రభుత్వాల రుణభారం, ముఖ్యంగా అమెరికా వడ్డీ రేట్ల పెరుగుదల అంచనాలు వంటి అంతర్జాతీయ అంశాలే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుగా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. యూఎస్ డాలర్ బలోపేతం కావడం, బాండ్ల రాబడులు పెరగడంతో వడ్డీ ఆదాయం లేని పసిడిపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గింది. మరోవైపు గోల్డ్ లోన్ల విషయానికి వస్తే.. బ్యాంకులు ఇప్పటికే మార్కెట్ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకుని మార్జిన్లు నిర్ణయిస్తాయి కాబట్టి, ప్రస్తుతానికి పాత రుణాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.

ధరలు తగ్గిన నేపథ్యంలో కొనుగోలుదారులు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక గోల్డ్ అసోసియేషన్ సూచించింది. నగల నాణ్యతలో ఇరిడియం, రుథీనియం వంటి లోహాల కల్తీ జరిగే అవకాశం ఉన్నందున, కొనుగోలు చేసే సమయంలో హాల్‌మార్క్, హెచ్‌యూఐడీ (HUID) సంఖ్య, బరువును క్షుణ్ణంగా పరిశీలించి, తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది.