మమ్మల్ని ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు సార్!: సీఎం ఎదుట గోడు వెళ్లబోసుకున్న యువ రైతు
- కర్ణాటకలో యువ రైతులకు పెళ్లిళ్లు కావడం లేదంటూ డీకేకు ఫిర్యాదు
- భూమి, ఇల్లు ఉన్నా అమ్మాయిలు ఇష్టపడటం లేదని యువరైతు ఆవేదన
- అమ్మాయిలు ఉద్యోగస్తులే కావాలంటున్నారని ఆరోపణ
- దీన్ని ఆరో గ్యారంటీగా స్వీకరించి పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
- ఇది తీవ్రమైన సామాజిక సమస్య అని స్పందించిన డిప్యూటీ సీఎం శివకుమార్
కర్ణాటకలో ఓ యువరైతు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు చేసిన ఓ విజ్ఞప్తి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్రామాల్లో యువ రైతులకు పెళ్లిళ్లు కావడం లేదని, ఈ తీవ్రమైన సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మైసూరు జిల్లాలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువరైతు, తమ గోడును నేరుగా డీకే శివకుమార్ ముందుంచారు. "గ్రామాల్లో యువకులకు సొంత ఇళ్లు, పొలాలు ఉండి, కష్టపడి పనిచేస్తున్నా పెళ్లిళ్లు కావడం లేదు. అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్కువ జీతం వచ్చే వారినే కోరుకుంటున్నారు. దీంతో 30, 40 ఏళ్లు దాటినా చాలా మంది బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. ఈ మానసిక వేదనతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలు ఇచ్చినట్లే, మా పెళ్లిళ్ల సమస్యను ఆరో గ్యారంటీగా భావించి పరిష్కరించాలి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యువరైతు వినతికి డీకే శివకుమార్ మొదట ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత అతడు చెప్పేది శ్రద్ధగా విన్నారు. సభలో కొందరు నవ్వడంతో, ఇది నవ్వుకోవాల్సిన విషయం కాదని, తీవ్రమైన సామాజిక సమస్య అని వారికి సూచించారు. మారుతున్న సామాజిక ప్రాధాన్యతలు, పట్టణ జీవనశైలి ప్రభావం, ఉద్యోగాల స్వరూపం వంటివి వివాహ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వీడియో వైరల్ కావడంతో, వ్యవసాయంపై యువతలో తగ్గుతున్న ఆసక్తి, గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు వంటి అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది. మంచి ఆస్తులున్న భూస్వాములకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.