మహిళలు కేవలం గృహ బాధ్యతలు నిర్వర్తించే రోబోలు కాదని, వారికి కూడా వ్యక్తిగత కలలు, ఆశయాలు ఉంటాయని ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి మహిళకూ తనదైన ప్రత్యేక గుర్తింపు అవసరమని ఆమె పేర్కొన్నారు. నివేదా థామస్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'శ్రీమతి' చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో రేణూ దేశాయ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భార్యల మనోభావాలను అర్థం చేసుకుంటూ, వారి ఆశయాలకు అండగా నిలిచే భర్తలు ప్రతి కుటుంబంలో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

సాధారణంగా ఒక స్త్రీ పుట్టినప్పటి నుంచి ఎవరో ఒకరి కూతురిగా, భార్యగా లేదా తల్లిగానే గుర్తింపు పొందుతుందని రేణూ దేశాయ్ అన్నారు. అందులో ఎలాంటి తప్పు లేకపోయినప్పటికీ, ప్రతి మహిళకు తనకంటూ సొంత అస్తిత్వం, గుర్తింపు కావాలని కోరుకుంటుందని తెలిపారు. ఈ అంశం చుట్టూనే 'శ్రీమతి' చిత్రం నడుస్తుందని వివరించారు. ఆడవారికి సంగీతం, నాట్యం లేదా ఇతర రంగాల్లో ఎన్నో కలలు, లక్ష్యాలు ఉంటాయని... వాటిని భర్తలు గుర్తించి గౌరవించాలని సూచించారు. కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా, ఇంటి బాధ్యతలతో పాటు పిల్లల పెంపకాన్ని కూడా దంపతులిద్దరూ సమాన భాగస్వామ్యంతో పంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికే తమ భార్యలకు అండగా నిలుస్తున్న భర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

మహిళల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఇలాంటి చక్కటి కథలను అన్ని భాషల్లోనూ రీమేక్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, ఈ కార్యక్రమంలో మీడియా కెమెరాలు తన వైపు రాగా, తానేమీ ప్రధాన పాత్ర పోషించలేదని, ఈ చిత్రానికి హీరో తిరువీర్ మాత్రమేనని చెబుతూ ఆమె పక్కకు తప్పుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. ఇందులో నివేదా థామస్ 'మధుశ్రీ' పాత్రలో, తిరువీర్ 'వాసుదేవ్' పాత్రలో నటించగా, రేణూ దేశాయ్ సంగీత ఉపాధ్యాయురాలిగా అతిథి పాత్రలో కనిపించనున్నారు. జీ5 ఒరిజినల్ ఫిల్మ్‌గా తెరకెక్కిన 'శ్రీమతి' చిత్రం డిసెంబర్ 4 నుంచి ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
Play video